IND Vs SL: ఇండియా ఘన విజయం.. సరికొత్త రికార్డు నమోదు!
IND Vs SL 3rd ODI: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. వన్డే చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. ఒకరకంగా గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. అదే సమయంలో, 2007లో బెర్ముడాపై వారు సాధించిన 257 పరుగుల విజయమే భారత జట్టు కంటే మునుపటి రికార్డు. ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 116 పరుగులతో, విరాట్ కోహ్లీ 166 పరుగులతో అజేయంగా నిలిచారు. అనంతరం శ్రీలంక జట్టు 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా అషెన్ బండార అసలు మైదానంలోకే రాలేక పోయాడు. దీంతో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఒక ఆటగాడిని రనౌట్ చేశారు. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంకపై ఇప్పుడు భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్‌లో శ్రీలంకపై టీమిండియా నాలుగోసారి క్లీన్‌స్వీప్ చేసినట్టు అయింది. ఇక తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో, రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.