IND vs NZ 1st ODI: హైదరాబాద్ వేదికగా నేడు న్యూజిలాండ్-భారత్ మధ్య తొలి వన్డే
IND vs NZ 1st ODI: శ్రీలంకతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ జట్టు ..నేడు న్యూజిలాండ్ తో తలపడనుంది. హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. వన్డేల్లో, టీ20ల్లోనూ కివీస్ పై టీమిండియాదే పైచేయి. ఈరోజు తొలి మ్యాచ్ గెలిచి సిరీస్ లో బోణీ ఎవరిదో తేలనుంది. నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
బ్యాటింగ్ లో టాపార్డర్ రోహిత్, గిల్, కోహ్లీలు సూపర్ ఫాంలో ఉన్నారు. శ్రేయస్, పాండ్య, అక్షర్ పటేల్ లు చెప్పుకోదగ్గ ప్రదర్శనే ఇచ్చారు. ఇక బౌలింగ్ లో సిరాజ్ తన కెరీర్ లోనే అద్భుత ఫాంలో ఉన్నాడు. అంతేగాక సిరాజ్, షమి, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్, షాబాజ్ అహ్మద్, చాహల్ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు జట్టులో ఉన్నారు. హైదరాబాదీ బౌలర్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలని తహతహలాడుతున్నాడు. సొంత గడ్డపై ఆడుతుండడంతో అందరి దృష్టి సిరాజ్‌పై నెలకొంది.
పాకిస్థాన్ తో జరిగిన వన్డే సిరీస్ ను 2-1తో గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టు ఉత్సాహంతో ఉంది. టామ్ లాథమ్, ఫిన్ అలెన్, బ్రాస్ వెల్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ లాంటి బ్యాటర్లు వారికున్నారు. బౌలర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, నికోల్స్, డారిల్ మిఛెల్, ఐష్ సోధి, బ్రేస్‌వెల్, సాంట్నర్ లతో కివీస్ చాలా పటిష్టంగా ఉంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్,శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్,మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్,ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.
ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 40 మందితో షీ టీమ్‌లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తారు. సెల్‌ఫోన్ మినహా ఇతర వస్తువులకు స్టేడియంలోకి అనుమతి లేదు. పాసులు, టిక్కెట్లు, బీసీసీఐ అనుమతించిన కార్డులు ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి రావడానికి అనుమతి ఉందన్నారు.