Rahul Dravid: భారత జట్టు నుంచి రాహుల్ ద్రావిడ్ ఏం కోరుకుంటున్నాడో తెలుసా?
India need to work on both batting and bowling, says Chief Coach Rahul Dravid
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రికెట్ ప్రేమికులను మజా అందిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచులు జరిగాయి. మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన భారత జట్టు మూడో మ్యాచ్ లో ఓటమి పాలయింది. ఇండోర్ పిచ్ సవాలు విసరడంతో భారత జట్టు కుదేలయింది. ఆసీస్ జట్టు ముందు చిత్తయింది. రేపటి నుంచి అహ్మదాబాద్ నగరంలో నాల్గవ టెస్టు ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పోటీల ఫైనల్ చేరాలంటే భారత్ ఆటతీరు మారాలని కోచ్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోను భారత జట్టు తమ సత్తా చాటాలని ద్రావిడ్ కోరాడు.
ఇండోర్ జరిగిన మూడో టెస్టులో భారత జట్టు చేసిన స్కోర్ విషయంలో ద్రావిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 109 పరుగులకే ఔటయిందని ద్రావిడ్ గుర్తుచేశాడు. మరో 60, 70 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ద్రావిడ్ అన్నాడు. నాల్గవ టెస్టు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ ద్రావడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో రాణించగలిగితే మ్యాచ్ ఫలితాన్నే మార్చివేస్తుందని ద్రావిడ్ తెలిపాడు. నాగ్ పూర్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన సెంచరీని ద్రావిడ్ గుర్తుచేశాడు.
ఇరు దేశాల ప్రధానుల హాజరు
అహ్మదాబాద్ నగరంలో నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా జట్లు నాల్గవ టెస్టు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ తొలి రోజున భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని కూడా వస్తున్నారు. ప్రత్యక్షంగా మ్యాచును వీక్షించనున్నారు. దీంతో మ్యాచ్ నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతను ఏర్పాటు చేశారు.,