Uppal Stadium: రేపు ఉప్పల్ స్టేడియంలో భారత్ – న్యూజీలాండ్ వన్డే మ్యాచ్, ఈ రోజు ఇరుజట్ల ప్రాక్టీస్
India and New Zealand teams Practice at Uppal Stadium
భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 3 మ్యాచుల సిరీస్ లో మొదటి మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి. కివీస్ జట్టు రెండు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకోగా, భారత జట్టు నిన్న రాత్రి చేరుకుంది.
ఇరు జట్లు ప్రాక్టీస్ చేసేందుకు వస్తున్నాయని తెలియడంతో ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల కోలాహలం ఏర్పడింది. వందలాది మంది ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఎగబడుతున్నారు.
రేపటి మ్యాచ్ సజావుగా జరిగేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజుల పాటు ఆన్ లైన్లో టిక్కెట్లు జారీ చేసింది. ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో ఫిజికల్ టిక్కెట్లు కూడా అందజేసింది.
మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా విశ్రాంతి లేకుండా ఏర్పాట్లలో నిమగ్నమయింది. మ్యాచ్ జరిగే రోజు ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. స్టేడియంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేడియంలో చర్యలు చేపట్టింది.
కొత్త ఏడాదిలో భారత జట్టు శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుంది. మంచి ఊపుతో ఉంది. అదే ఊపు న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచుల్లోను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత పర్యటనకు వచ్చిన కివీస్ జట్టు 3 వన్డేలు, 3 టీ 20 మ్యాచులు ఆడనుంది.
తొలి వన్డే మ్యాచ్ హైదరాబాద్ లో జనవరి 18న జరగనుండగా, రెండో వన్డే మ్యాచ్ రాయ్ పుర్ లో జనవరి 21న జరగనుంది. వన్డే సిరీస్ లో చివరిదైన మూడో మ్యాచ్ జనవరి 24న ఇండోర్ లో జరగనుంది. ఈ మ్యాచులన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1.30కు ప్రారంభం కానున్నాయి.
ఇక టీ 20 మ్యాచుల విషయానికి వస్తే తొలి టీ 20 మ్యాచ్ జనవరి 27న రాంఛీలో జరగనుంది. రెండో టీ 20 మ్యాచ్ జనవరి 29న లక్నోలోను, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ లోను జరగనుంది.