Fourth Test Ind vs Aus: నేడే భారత్- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు
Fourth Test Ind vs Aus: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడమే లక్షంగా పెట్టుకున్న టీమిండియా నేడు ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్‌కు ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఇక ఈమ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ టీమ్ రంగంలోకి దిగనుంది. అలాగే చివరి మూడవ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా కూడా గెలుపుపై ధీమాగా ఉంది. నాలుగో టెస్టు తొలి రోజున నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినటువంటి అహ్మదాబాద్‌లో భారత జట్టు కంగారుసేనతో బరిలోకి దిగబోతోంది. తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా మూడో మ్యాచ్‌లో అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఇదే జోరును అహ్మదాబాద్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. టెస్టు కోసం భారత్ తుది జట్టులో మార్పులు చేసే చాన్స్ కనిపిస్తున్నది. గత మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో నిరాశపరిచిన వికెట్‌కీపర్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీమిండియాను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ జట్టుకు బ్యాటింగ్ సమస్యగా మారింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లోనూ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. విరాట్ కోహ్లి, చటేశ్వర్ పుజారాలు కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. గతంలో టెస్టుల్లో పరుగుల వరద పారించిన కోహ్లి ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. నేడు జరిగే మ్యాచ్ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌కే మొగ్గుచూపినట్లు తెలిసింది. పిచ్‌ను పరిశీలించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముందని వ్యాఖ్యానించాడు.
లక్షా 32 వేల సామర్థ్యం కలిగిన ఈ అతిపెద్ద స్టేడియానికి తన పేరు పెట్టాక ప్రధాని మోదీ ఇక్కడ హాజరుకానుండడం ఇదే తొలిసారి. బంగారు వర్ణ గోల్ఫ్ కారులో కూర్చుని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తో స్టేడియంలో తిరగనున్నారు.