India Vs England: లార్డ్స్ వన్డేలో భారత్ పరాజయం..!
IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ లో భారత్ మొదటి వన్డేలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే దూకుడును రెండో వన్డేలో ప్రదర్శించలేకపోయింది. లార్డ్స్ లో జరిగిన రెండో వన్డేలో బౌలర్లు రాణించి ఇంగ్లాండ్ జట్టును 246 పరుగులకు కట్టడి చేశారు. అయితే, భారత్ బ్యాటింగ్ విభాగంలో విఫలం కావడంతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లాండ్ భారత్ పై 100 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్, ఇంగ్లాండ్ జట్టు చెరో మ్యాచ్ లో విజయం సాధించాయి. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే ఈనెల 17 వ తేదీన జరగనున్నది.
రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 102 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే మొయిన్ ఆలీ, విల్లీలు పోరాడటంతో ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేయగలిగింది. ఇక ఇండియా జట్టును ఇంగ్లాండ్ ఫేస్ బౌలర్ టాప్ లీ దారుణంగా దెబ్బతీశాడు. 9.2 ఓవర్లు వేసిన టాప్లీ కేవలం 24 పరుగులు ఇచ్చి కీలకమైన ఆరు వికెట్లు తీసుకున్నాడు. హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్, జడేజా లు ఆదుకునే ప్రయత్నం చేసినా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో 146 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది.