Ravi Shastri : అలా చేస్తే టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ వస్తుంది: రవిశాస్త్రి
Ravi Shastri Test Cricket Format: ప్రపంచ క్రికెట్లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గుతోందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ను ఐసీసీ ర్యాంకింగ్స్‌లోని టాప్ 10లో ఉన్న జట్లు ఆడుతున్నాయని, ఆలా కాకుండా టాప్ 6 జట్లు మాత్రమే టెస్టు మ్యాచ్‌లు ఆడేవిధంగా చూడాలని రవిశాస్త్రి సూచించారు. ఆరు జట్లు మాత్రమే రెడ్ బాల్ మ్యాచ్ ఆడితే క్వాలిటీ క్రికెట్ చూడొవచ్చన్నారు. మ్యాచ్‌లు ఎక్కువగా ఉండటం కాదన్న ఆయన.. ప్రేక్షకులకు నాణ్యమైన ఆటను చూపించాలన్నారు. టాప్ 6లో ఉండే టీమ్ ఆ గ్రూప్‌లోని మిగతా జట్లతో టెస్టు క్రికెట్ ఆడుతుందని, గ్రూప్‌లో లేకపోతే ఆడే పరిస్థితే ఉండదన్నారు. అది భారత్, ఆసీస్, ఇంగ్లాండ్ .. ఇలా ఏజట్టైనా సరే టాప్-6లో ఉండాల్సిందేనన్నారు. అప్పుడే నాణ్యమైన క్రికెట్ అందించినట్లు అవుతుందని వివరించారు.
తెల్ల బంతి క్రికెట్‌ను విస్తరించడానికీ చాలా అవకాశాలు ఉన్నాయని రవిశాస్త్రి తెలిపారు. టెస్టులను తక్కువ జట్లతో నిర్వహించి.. టీ20, వన్డే క్రికెట్‌ను అన్ని టీమ్‌లతో ఆడించాలని సూచించారు. క్రికెట్‌ను అన్ని దేశాలకు తీసుకెళ్లాలంటే టీ20, వన్డే ఫార్మాట్‌ను విస్తరిస్తే చాలన్నారు. అందుకోసం ఎక్కువ జట్లతో మ్యాచ్‌లు నిర్వహించవచ్చని, మరీ ముఖ్యంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగిపోయింది కాబట్టి.. ఫుట్‌బాల్ తరహాలో ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.