పెరుగుతున్న లేయింగ్ డౌన్ కల్చర్
పని ఒత్తిడికి దూరంగా వెళ్లాలన్న ఆలోచన..
Lying down : పని ఒత్తిడి.. ఎలాంటి మనిషినయినా చిత్తు చేసేస్తుంది. విరామం లేకుండా చేస్తున్న పనులను వదిలి దూరంగా పారిపోయేలా ప్రేరేపిస్తుంది. అవును ఇది నిజం. ఇప్పుడు దీనికి ఉదాహరణగా చైనా ((China)) దేశాన్నే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ‘నిరంతరాయంగా చేసే పని’ అనే ఆయుధాన్నే వాడుకుని ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్న చైనా..ఇప్పుడు పని ఒత్తిడితో ప్రజలు తీసుకుంటున్న నిర్ణయంతో ఆలోచనలో పడింది. తొలి అడుగు ఎప్పుడూ ఒంటరిదే ఆ తర్వాత ఆ అడుగులతో పాటు కలిసే అడుగులు ఎన్ని అనే ఆలోచనలే చైనాను కలవరపెడుతున్నాయి. ఇప్పుడు అలాగే ఓ అడుగేసిన చైనా లోని ఓ 29 ఏళ్ల యువకుడు.. తమ ఎంత మందిని మార్చేస్తాడో అన్న భయాన్ని కలిగిస్తున్నాడు. అసలు ఏంటీ లేయింగ్ డౌన్ కల్చర్ ? ఆ 29 ఏళ్ల యువకుడు ఇలాంటి న్యూస్ తో ఎందుకు వార్తల్లోకి ఎక్కాడు.?
చైనాలో పెరుగుతున్న లేయింగ్ డౌన్ కల్చర్..
చైనాలో పని ఒత్తడి అక్కడి యూత్ లో బాగా మార్పు అనేకంటే విపరీతమైన మార్పు తీసుకువస్తోందని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. వీకెండ్స్ లో ప్రశాంతత కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ అవుతుందట. అంతే కాదు ఏకంగా కొంతమంది ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి విశ్రాంతి తీసుకోవడం మొదలు పెట్టారట. అచ్చంగా ఇలాగే ఏ పనీ చేయకుండా ఓ టెంటులోనే ఉంటున్న చైనాకు (China) చెందిన ఓ 29 ఏళ్ల యువకుడు..ఈ మధ్య చైనా మీడియాలో వార్తగా మారిపోయాడు. ‘లేయింగ్ డౌన్’ (Lying down) కల్చర్ ను ఫాలో అవుతున్న వ్యక్తిగా అక్కడి వారి నోట్లో నానుతున్నాడు .
చైనా పేరు చెప్పగానే అక్కడి యంత్రాల్లా చేసే మనుష్యులే గుర్తుకు వస్తారు. ఇంకా చెప్పాలంటే యంత్రాలతో పోటీ పడి మరీ ప్రొడెక్టివిటీని పెంచడంలో ప్రపంచంలోనే వాళ్లని మించినవారు లేరన్న ముద్రను వేసుకున్నారు. అయితే కరోనా తర్వాత అక్కడి పరిస్థితులు మారిపోయాయి. పని చేయడానికి ఇష్టపడని వాళ్ల సంఖ్య పెరుగుతోంది. విశ్రాంతి తీసుకోవడానికి, వీలైతే ప్రశాంత జీవితం గడపడానికి అక్కడి వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగా దారులు కూడా వెతుక్కుంటున్నారు. దీనికి ఉదాహరణే ఇప్పుడు చైనాలో 29 ఏళ్ల యువకుడు లీషు గురించి చెప్పుకోవచ్చు.
ఎవరీ లీషు.. ఏం చేస్తున్నాడు?
సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన అతను.. 2018 నుంచీ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ఆ తర్వాత వేరే ఉద్యోగం వెతుక్కోకుండా.. అద్దె ఇంట్లోనే ఉంటూ వస్తున్నాడు. దీంతో అతని దగ్గర ఉన్న డబ్బులు చాలా వరకు ఖర్చయినా…జాబ్ మాత్రం చేయడానికి ఇష్టపడలేదు. మొత్తం ఖర్చయిపోతే ఉద్యోగం చేయాల్సి వస్తుందన్న భయంతో ఏకంగా ఆ ఇంటిని ఖాళీ చేసి..తన ఫర్నిచర్ అమ్మేసి దగ్గర లోని ఓ పార్కింగ్ యార్డులో మకాం పెట్టేసాడు.
అక్కడ చెత్తా చెదారాలతో ఉన్నా అక్కడే టెంట్ వేసుకుని సర్థుకుపోతున్నాడు తప్ప ఉద్యోగానికి వెళ్లడం లేదు. 200 రోజులుగా అక్కడే ఉంటూ చీప్ గా దొరికే నూడుల్స్, డంప్లింగ్స్ తింటూ కాలం గడుపుతున్నాడు. లీషును చూసి అతని ఫ్రెండ్స్ , బంధువులు ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఇలా జీవించడంలోనే తాను చాలా హ్యాపీగా ఉంటున్నానని.. ఫ్యూచర్లో కూడా ఉద్యోగం చేసే ఆలోచన లేదని చెప్పేస్తున్న అతన్ని చూసి ఇటు బయట జనాలు కూడా షాక్ అవుతున్నారు. అంతేకాదు.. తన లివింగ్ స్టైల్ గురించి వేదాంతాలు చెప్పుకొస్తున్నాడు. జీవితంలో నెరవేరని లక్ష్యాల వెనుక పరిగెత్తడం ఆపినప్పుడే ప్రశాంతత లభిస్తుందని.. మారిన పరిస్థితులకు అలవాటు పడతామని.. అప్పుడే జీవితానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుందని అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు కూడా జీవిత పాఠాలు చెబుతున్నాడు.
లేయింగ్ డౌన్ కల్చర్ ఎక్కడ ఉంది?
ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్య అతనితోనే మొదలయిందంటున్నారు అక్కడి అధికారులు. ఇప్పటికే ఇదే ధోరణితో ఇదే ఆలోచనలతో ఉన్న వారు అక్కడ చాలామంది ఉన్నారు. వీరందరికీ లీషు ఎక్కడ ఆదర్శంగా మారుతాడోనని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి మైండ్ సెట్ మనష్యులు చాలామంది ఉన్నారన్న సర్వేల లెక్కలు.. చైనాను వణికిస్తున్నాయి. మరోవైపు ఈ లేయింగ్ డౌన్ సంస్కృతి భారత దేశంతో పాటు ఇతర దేశాలలోనూ ఉందని ..కాకపోతే అవన్నీ వార్తలకు ఎక్కని సంఖ్యలో కలిసిపోతున్నారని కొంతమంది నిపుణులు అంటున్నారు. మనకు తెలిసిన వాళ్లలోనే చాలామంది ఇలాంటి జీవితం గడుపుతున్నారు. అంతవరకూ ఉన్న మంచి జీతం, హోదాను వదిలిపెట్టి హఠాత్తుగా లేయింగ్ డౌన్ కల్చర్ కు అలవాటు పడినవాళ్లు ఎంతోమంది ఉన్నారు.