కొత్త పర్యాటక ప్రాంతాలను అసలు మిస్ అవ్వొద్దు
Tourist Spots : ఎక్కడెక్కడివారికైనా హైదరాబాద్ అంటే కాస్త ఎక్కువ ఇష్టమే ఉంటుంది. కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ తో పాటు.. మిక్స్ అండ్ మ్యాచ్ లా ఆనాటి పాత కట్టడాల అందాలు అబ్బుర పరుస్తుంటే.. ఈ నాటి లేటెస్ట్ నిర్మాణాలు వావ్ అనిపిస్తాయి. అందుకే కాస్త టైమ్ దొరికితే హైదరాబాద్ లో వాలిపోదామా అనుకున్న టూరిస్టులు లేకపోలేదు. ఇలాంటి వారిని ఏ మాత్రం నిరుత్సాహపర్చకుండా ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అవుతూనే ఉంటుంది భాగ్యనగరం. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త పర్యాటక ప్రాంతాలు ( Tourist Spots) ఏమున్నాయో ఓసారి చూద్దాం.
హైదరాబాద్ వచ్చిన వారెవరూ ఒక ట్రిప్ లో చూడాల్సిన ప్లేసులన్నీ చూడలేరు. ఎన్ని రోజులు ఉండి చూసినా .. అర్రెర్రే అదెలా మిస్ అయ్యామంటూ అనుకునే ప్లేస్ ఒకటి తప్పకుండా ఉంటుందనే చెప్పొచ్చు. అంతగా భాగ్యనగరం ఎన్నో అందాలను, అద్భుతాలను తనలో దాచుకుని టూరిస్టులకు హాట్ ఫేవరేట్ లిస్ట్ లో ఎవ్వర్ గ్రీన్ గా వెలిగిపోతూ ఉంటుంది. మామూలుగానే హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే చార్మినార్, హుస్సేన్ సాగర్ బుద్దుడు, బిర్లా టెంపుల్, గోల్కొండ వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ కొన్ని గత వైభవానికి గుర్తులుగా దర్జాగా కనిపిస్తుంటే.. మరికొన్ని భాగ్యనగరానికి ఆభరణాలుగా ధగధగా మెరిసిపోతుంటాయి. ఇలాంటి హైదరాబాద్ కు మరిన్ని సొగసులు అద్దుతూ 5 కొత్త అందాలు వచ్చి చేరాయి.
కొత్త పర్యాటక ప్రాంతాలను అసలు మిస్ అవ్వొద్దు
దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్..
నిజం చెప్పాలంటే కేబుల్ బ్రిడ్జ్ (Cable Bridge) .. వచ్చి హైదరాబాద్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకువెళ్లింది. డిఫరెంట్ కలర్స్ తో వెలిగే లైటింగ్స్ తో ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి అల్లంత దూరం నుంచే తన ఉనికిని భాగ్యనగర వాసులకు తెలియజేస్తూ ఉంటుంది. కొత్త అందాలతో ప్రతీ వ్యక్తిని తల ఎత్తి తనను చూసేలా మాయ చేస్తూ ఉంటుంది. ప్రతి స్తంభానికి ప్రతి వైపు 13 కేబుల్స్ ఉంటూ స్పెషల్ లుక్ తో కనిపిస్తుంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ రాని వారు దీనిని చూస్తే కనుక ..అసలు ఇది హైదరాబాద్ నా .. లేక ఏ ఫారెన్ కంట్రీనా అని ఆశ్చర్యపోతారనడంలో అనుమానమే లేదు. అంతగా కొంగొత్త అందాలతో మురిపిస్తూ ఉంటుంది ఈ కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్ చేస్తూ ఈ అందాలను చూస్తే అది వేరే లెవల్ అంటారు చాలామంది.
ఈ కేబుల్ బ్రిడ్జ్ మాదాపూర్ వద్ద ఇనార్బిట్ మాల్ దగ్గర ఉంది. ఇది ఇటు జూబ్లీహిల్స్ ను, అటు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ను కలుపుతోంది. దుర్గం చెరువు మీదుగా మాదాపూర్ వరకూ ఈ బ్రిడ్జ్ వల్ల దాదాపు చాలా ట్రాఫిక్ కంట్రోల్ తప్పిందనే చెప్పొచ్చు. అంతకు ముందు మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకూ వెళ్లడానికి 40 నుంచి 60 నిమిషాలు పట్టేది. దీనిని తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్.. ట్రాఫిక్ కష్టాలను తగ్గించడం కంటే పర్యాటక ప్రాంతంగానే బాగా ఫేమస్ అయింది.
గండిపేట్ పార్క్..
గండిపేట్ తెలుసు మరి ఈ గండిపేట్ పార్కేంటి (Gandipet Park) అనే అనుమానంతో వెళ్లినవారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా ఉంటుంది ఈ పార్క్. రీసెంట్ గానే ప్రారంభించిన ల్యాండ్ స్కేప్ పార్క్ (Landscape Park) ప్రకృతి ప్రేమికుల కోసమే రెడీ చేశారా అన్నట్లు ఉంటుంది. ఎకో పార్క్ థీమ్(Eco Park theme) తో హెచ్ఎండీఏ 30 కోట్ల రూపాయలకు పైగా ఈ పార్కు అభివృద్ధికి ఖర్చు పెట్టింది. 18 ఎకరాల్లో ఉన్న ఈ పార్కు ఎప్పుడూ చిన్నపిల్లలు, పెద్దవారితో సందడి సందడిగానే ఉంటుంది.
ఈ పార్కులో ప్రధాన ఆకర్షణలుగా ఆక్వేరియం, ఇన్ఫినిటీ పూల్, విలాసవంతమైన చెక్క కాటేజీలు, క్యాంపింగ్ టెంట్లు, ఏవియరీ, బటర్ ఫ్లై పార్కు వంటి థీమ్ తో.. ది బెస్ట్ ఎంజాయింగ్ ప్లేస్ గా జెండా పాతేసింది. దీనికి తోడు టూరిస్టులను అక్కడే ఉండేలా కూడా చాలా సదుపాయాలు ఉండటంతో పర్యాటకులు కూడా క్యూ కడుతుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ ను పంచుతాయి. దీంతో ఇప్పటి వరకూ గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకున్న గ్రేటర్ హైదరాబాద్ లో.. గండిపేట ఎకో పార్క్ మెయిన్ అట్రాక్షన్ గా మారిపోయిందని ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలే కాకుండా.. ఓఆర్ఆర్ కు అతి దగ్గరగా ఉండడంతో పర్యాటకుల మనసు వద్దన్నా అటు పరుగులు తీసేలా పార్కును తీర్చిదిద్దారు. మామూలు రోజుల్లో గండిపేట్, కోకాపేట్, నార్సింగ్, మణికొండ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటే.. వీకెండ్స్ లోనూ, శెలవు సమయాల్లోనూ పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు.
బన్సీలాల్ పేట్ మెట్లబావి..
బన్సీలాల్ పేట్ మెట్లబావి (Bansilal Pate Steps well)ని తెలంగాణ ప్రభుత్వం వెలుగులోకి తీసుకువచ్చి పునర్వైభవం కలిగించడంతో.. కొత్త సొబగులు అద్దుకుని సాయంత్రం అయితే అయితే విద్యుత్ కాంతుల వెలుగుల్లో వింత అందాలతో మెరిసిపోతూ కనిపిస్తోంది. బన్సీలాల్ పేట్ లోని 17 వ శతాబ్ధపు పాత మెట్ల బావిని చూసిన వారెవరయినా వావ్ అనకుండా ఉండటం అసాధ్యమే. అద్భుతమైన మేకోవర్, కలర్ ఫుల్ లైటింగ్స్ మధ్య మరీ కొత్తగా కనిపిస్తూ మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్లిపోతుంది .
3 శతాబ్దాల క్రితం 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో నాగన్నకుంట మెట్లబావిని నిర్మించారు. అలా భాగ్యనగర చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే ఇలాంటి బావుల పునరుద్ధరణ చేసి.. నాటి వైభవాన్ని ఇప్పటి తరాల కళ్ల ముందుకు తీసుకు రావడంలో తెలంగాణ సర్కారు భావి తరాలకు గుర్తుండిపోతుంది. మామూలు రోజుల్లో హైదరాబాదీలు మాత్రమే వచ్చే ఈ ప్రాంతం.. శెలవుల్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులను రప్పించుకుంటోంది ఈ టూరిస్ట్ స్పాట్. ప్రారంభం అయిన కొద్ది రోజులకే సెల్ఫీ పాయింట్(Selfie point) గా గుర్తింపు పొందింది. ఇక టోటల్ గా బన్సీలాల్‌పేట్ మెట్లబావి చెప్పాలంటే.. ఆ ప్రాంతానికి వెళ్లగానే ఒక్కసారిగా మిమ్మల్ని మైమరిచి పోయేలా చేస్తుందనడంలో సందేహమే లేదంటారు పర్యాటకులు.
మల్కం చెరువు పార్క్..
మల్కం చెరువు పునరుద్ధరణలో భాగంగానే దీనిని అభివృద్ధి చేసినా.. హైదరాబాద్ కొత్త పర్యాటక ప్రాంతాలలో ది బెస్ట్ గా స్థానం సంపాదించేసుకుంది. హైదరాబాద్ లోని రాయదుర్గం చెరువును గ్రీన్ పార్కుతో పునరిద్ధరించిన తెలంగాణ సర్కార్ దీనికి మల్కం చెరువు పార్క్ (Malkam Pond Park) అని పేరు పెట్టారు. దుర్గం చెరువుతో పాటు 2018లో మల్కా చెరువు పనులు ప్రారంభించారు. పిల్లల కోసం ప్లే గ్రౌండ్, మెచ్యూర్ ట్రీలైన్ బౌండరీ, జిరోఫైట్ గార్డెన్, వ్యూ డెక్‌లు, ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్లు, యాంఫీథియేటర్, ఫ్రీ ప్లే లాన్ల వంటి ఎన్నో ఆకర్షణలతో మల్కం చెరువు పార్కును చక్కగా తీర్చిదిద్దారు.
సుమారు 50 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్కు చిచ్చర పిడుగుల కోసమే కాదు.. పెద్దవాళ్లకు వాకింగ్ , పార్కు ఉండటంతో సాయంత్రం అయితే చాలు మల్కం చెరువు పార్క్ సందర్శకులతో కిటికిటలాడుతూ ఉంటుంది. దీనికి తోడు హైదరాబాద్ మెయిన్ ఆకర్షణ అయిన ఫుడ్ సెంటర్స్ ఇక్కడ వరుసగా బారులు తీరడంతో.. పుడ్ లవర్స్ కూడా ఈ పార్కుకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిన ఫుడ్ టేస్ట్ చేయడంతో పాటు.. మనసారా ఎంజాయ్ చేసే ఎన్నో ఆకర్షణలు ఉండటంతో సాయంత్రం అయితే ఈ ప్రాంతం కలర్ ఫుల్ గా మారిపోతుంది. అందుకే కొత్తగా హైదరాబాద్ వచ్చిన వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా..మళ్లీ మళ్లీ ఈ పార్కు నామజపం చేస్తారనడంలో నో డౌట్ అంటారు సందర్శకులు.
హుస్సేన్ సాగర్ లోని మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్..
హుస్సేన్ సాగర్ లోని మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ( Musical water fountain).. ఈ మధ్య కాలంలో పర్యాటకులను తెగ ఆకట్టుకుంటోంది. రూ. 17.2 కోట్ల ఖర్చుతో 180 మీటర్ల పొడవు.. 10 మీటర్ల వెడల్పు, 90 మీటర్ల హైట్ తో హెచ్ఎండీఏ ఈ మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్ ను రూపొందించింది. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్‌లతో పొగ మంచు ఫెయిరీ ఫాగ్, క్లౌడ్ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తూ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లేలా డిజైన్ చేశారు. అద్భుత వాతావరణంలో ఆహ్లాదకరమైన మ్యూజిక్ ను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
మ్యూజికల్ ఫౌంటెన్ ను చూసేందుకు సాధారణ రోజుల్లోనూ సాయంత్రం అయితే సందర్శకులు పోటెత్తుతారు. సాగర తీరంలో జిల్ జిల్ జిగా అంటూ ఫోటోలను వీడియోలు షేర్ చేస్తూ స్వీట్ మెమరీస్ ను పంచుకుంటున్నారు. నిజానికి సోషల్ మీడియా వల్లే ఈ ప్రాంతం ఫేమస్ అయింది. ఎందుకంటే మ్యూజికల్ ఫౌంటెన్ ఫోటోలను పెట్టడంతో .. దీనిని చూడాలన్న కోరికను అందరిలో పెంచేస్తున్నారు సందర్శకులు.