ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ ఉద్యమ జ్వాల మారోజు వీరన్న
MAROJU VEERANNA : దేశ (COUNTRY) విముక్తి కోసం, కుల, వర్గ పోరాటాలను నిర్మించాలన్న సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆ బాటలో పయనించిన విప్లవ వీరుడు కామ్రెడ్ మారోజు వీరన్న (Marooji Veernna). ఆస్థిత్వ ఉద్యమాల నిర్మాణం ద్వారా సమస్త ప్రజల (People) విముక్తికి పూల బాటలు వేసిన బహుజనుడు మారోజు ఈ ప్రపంచానికి దూరమై 23 ఏళ్లవుతున్న సందర్భంగా ఆయన్ను స్మరించుకోవటం మనందరి బాధ్యత. పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణా పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాతగా వీరన్న చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. ప్రతి అస్థిత్వ పోరాటంలోనూ ఆయన సజీవంగానే ఉంటారు. 1996లో జనశక్తి నుంచి బయటకొచ్చేసిన వీరన్న విప్లవ ఉద్యమాలు చిరకాలం నిలబడటానికి కులపోరాటం కూడా చేయాల్సి ఉందని పిలుపునిచ్చిన ఈ కాలం వీరుడు. ఆ పోరాటాలు సఫలమైనప్పుడే బహుజనులకు విముక్తి లభిస్తుందని ఎలుగెత్తి చాటిన గళం ..మారోజు.
ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా…
ఉస్మానియా యూనివర్సిటీ (OU)కేంద్రంగా మారోజు నడిపిన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. భౌగోళిక తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలనే లక్ష్యం, నినాదంతో మారోజు వీరన్న తెలంగాణ మహాసభ (Telangana Mahasabha)ను స్థాపించారు. కవులు, కళాకారులు, విద్యార్థులతో 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన సమావేశంలో తెలంగాణ డిక్లరేషన్ చేసి మలిదశ ఉద్యమకారుడయ్యాడాయన. ఆంబేద్కర్ (Ambedkar)ఆశయాలే ఆయన ప్రచార సాధనాలయ్యాయి. అంబేద్కర్ ఆలోచనలో భాగమైన చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించి ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లాడు. అణగారిన కులాలు, జాతులు, తెగలను ఐక్యం చెయ్యడానికి దళిత బహుజన మహాసభ స్థాపించారు. ఐక్య రాజకీయ ఉద్యమాల నిర్వహణ కోసం మహాజన ఫ్రంట్‌ను రూపొందించారు. విద్యార్థులను బహుజన రాజ్య నిర్మాణానికి సిద్థం చేసి 1998 ఆగస్టు 18న బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (BDSF) స్థాపించారు. వీరన్న ఆలోచనలే నేడు పీడీత సమాజానికి పదునైన ఆయుధాలయ్యాయి.
ఫ్యూడల్ ప్రభువులను అడ్డుకోవాలంటే…
దేశంలో ప్రాథమిక ప్రణాళిక అంటే వాస్తవంగా సామాజిక నిర్మాణమేనని నమ్మిన సిద్దాంతకర్త. వాటి ఆధారంగానే అసలైన రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉందని, మెరుగైన సమాజ నిర్మాణానికి విప్లవోద్యమాన్ని జోడించి అద్భుత రూపాన్ని ఇచ్చారాయన. మారోజు జీవితమంతా పోరాటాలే. ఎందరికో స్ఫూర్తి, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఎంతో మందికి మార్గదర్శి. తన జీవిత ప్రయాణమంతా దోపిడీ శక్తులకు వ్యతిరేకంగానే సాగింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో అమరుడయ్యాడు.
ఆయన అడుగుజాడలే
శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవు. వీరన్న చూపిన రాజకీయ సైద్ధాంతిక వెలుగులో పురోగమించడమే ఆయన స్మృతిలో నిజమైన నివాళి. సమానత్వ సమాజ మార్గానికి పునాది.