TDP Mahanadu: ఎన్నికల ఏడాది మహానాడు జరుగుతోంది. రాజమండ్రి లో టీడీపీ పసుపు పండుగ ప్రారంభమైంది. ఈ రోజు, రేపు రెండ్రోజులపాటు అట్టహాసంగా మహానాడు సమావేశాలను ఆ పార్టీ నిర్వహించనుంది. ఈ రోజు తొలి రోజు సమావేశాల్లో భాగంగా ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ జరుగుతాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కావడం ఈసారి మహానాడు సమావేశాలకు అదనపు ప్రత్యేకతగా నిలవనుంది. ఈ సారి మహానాడులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యంగా ప్రసంగాలు..తీర్మానాలు ఉండనున్నాయి. పొత్తుల అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. పార్టీ బహిరంగ సభలో చంద్రబాబు ఎన్నికలకు సిద్దం చేస్తూ పార్టీకి దిశా నిర్దేశం చేయనున్నారు.
రాజమండ్రిలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలు..కార్యకర్తలు తరలి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. మహానాడు ప్రారంభం గా చంద్రబాబు ప్రసంగం ఆరంభమైంది. పార్టీ కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రిలో మహానాడు నిర్వహణ వెనుక సెంటిమెంట్ ముడి పడి ఉంది. 1993లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగర్జన సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనంలో వచ్చారు. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అపూర్వ విజయం సాధించింది. అదే సెంట్‌మెంట్‌తో ఇప్పుడిక్క మహానాడు నిర్వహిస్తున్నారు. 2006లో కూడా ఇక్కడ మహానాడు జరిపినా.. అప్పుడు కేవలం ప్రతినిధుల సభే జరిగింది. బహిరంగ సభ నిర్వహించలేదు. ఈసారి రెండూ నిర్వహించనున్నారు.
మహానాడులో అమలు చేసే తీర్మానాలకు పార్టీ పోలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మొత్తం 21 తీర్మానాలను మహానాడులో చర్చకు ప్రతిపాదించనున్నారు. వీటిలో 14 ఆంధ్రప్రదేశ్‌కు, ఆరు తెలంగాణకు సంబంధించినవి. ఆంధ్ర తీర్మానాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి సంక్షోభం, విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, పఽథకాల పేరిట ప్రచారార్భాటం వంటివాటిపై మహానాడు ప్రధానంగా దాడి చేయనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు, పేదరికం నిర్మూలనకు తీసుకున్న చర్యలు, ఆ సమయంలో రాష్ట్రాభివృద్ధిని కూడా నేతలు వివరిస్తారు. ఈ మధ్య కాలంలో మరణించిన పార్టీ నేతలకు సంతాప తీర్మానం, పార్టీ జమా ఖర్చుల నివేదిక, ప్రధాన కార్యదర్శి నివేదిక వంటి ఎజెండా ఉంటుంది. చంద్రబాబు ప్రసంగం తర్వాత వివిధ అంశాలపై చర్చలు మొదలవుతాయి.
మహానాడులో రాజకీయ తీర్మానం పైన చర్చ జరగనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉనికి ఆంధ్రలో నామమాత్రమే కావడంతో ఆ పార్టీ గురించిన ప్రస్తావన ఈ చర్చలు, తీర్మానాల్లో అవసరం లేదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో నెలకొంది. పొత్తులకు తమ పార్టీ సుముఖంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పేర్కొన్న నేపఽథ్యంలో మహానాడు వేదికగా టీడీపీ కూడా అటువంటి సంకేతాన్నే ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ తీర్మానంలో తన వైఖరిని ప్రకటించవచ్చని అంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భావ సారూప్యం ఉన్న పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని టీడీపీ నాయకత్వం పేర్కొనవచ్చని ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబును పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోనుంది.
సంక్షేమం జెండా, అజెండా మనదే. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో.. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. దేశానికి చూపిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశాలను పేర్కొన్న చంద్రబాబు మహానాడు ద్వారా సంక్షేమం గురించి తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోయేదీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. రేపు 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను మహానాడు సందర్భంగా ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ముగింపు ప్రసంగంలో చంద్రబాబు వచ్చే ఎన్నిలకు సంబంధించి కీలక అంశాల పైన స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. ఇక, అతిధుల కోసం ప్రత్యేకంగా వంటకాలు సిద్దం చేస్తున్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది హాజరవుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.