TDP Mahanadu: మహానాడు. పసుపు పండుగ. తెలుగుదేశం నిర్వహించే ప్రత్యేక పర్వదినం. పార్టీకి దిశా నిర్దేశం చేసే వేడుక. ఈ సారి పార్టీ మహానాడు రాజమహేంద్రవరం లో జరగనుంది. గతం కంటే ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. దాదాపు లక్షల మంది ఈ సారి మాహానాడుకు తరలి వస్తారని అంచనా. పార్టీ అధ్యక్ష ఎన్నిక నుంచి వంటకాల వరకూ ప్రతీదీ ఈ రెండు రోజుల సంబరాల్లో ప్రత్యేకమే. ఎన్టీఆర్ 1983లో ప్రారంభించిన ఈ మహానాడు ఒక్కో ప్రత్యేకతతో ఇప్పటికీ అప్రతిహాతంగా కొనసాగుతోంది. 40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో మహానాడు ప్రత్యేకత ఏంటి. అన్నగారి ఆలోచనలకు నిలువటద్దంగా నిలుస్తోందా.?
మహానాడు. ఈ పేరు ఖరారు..ప్రకటన అంతా ఓ అనూహ్యమైన ఆసక్తికర రాజకీయ నిర్ణయం. 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భవించాక పార్టీ జెండా, గుర్తు లాంటి అంశాలపై చర్చలు జరిగాయి. అదే సమయంలో ఏప్రిల్ 11న పార్టీ ఆశయాలను..అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక భారీ సభకు నిర్ణయించారు. ఆ సభకు ఎన్టీఆర్ మహానాడు అని పేరు పెట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ ఏటా పార్టీ విధాన పరమైన నిర్ణయాల సమీక్ష..కొత్త నిర్ణయాల ప్రకటకు ఒక వేదిక అవసరమని భావించారు. ఇందుకు పార్టీ నేతలంతా ఒకే వేదికమీదకు వచ్చేలా కార్యక్రమం ఏర్పాటుకు డిసైడ్ అయ్యారు. అదే మహానాడుగా మారింది. ప్రతీ ఏటా నిర్వహణకు అంకురార్పణ జరిగింది.
టీడీపీ ఆవిర్భావం ఒక సంచలనం. తొమ్మిది నెలల్లో అధికారం దక్కించుకోవటం ఒక చరిత్ర. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 1983లో తొలి సారి మహానాడు ప్రారంభించారు. టీడీపీ తొలి మహానాడు కు గుంటూరు వేదికగా నిలిచింది. 1983 లో మే 26, 27, 28 తేదీల్లో నిర్వహించిన తొలి మహానాడుకు ఎన్టీఆర్ పలు జాతీయ ప్రముఖులను ఆహ్వానించారు. అప్పటికే కాంగ్రెస్ ను ఓడించిన ధీరుడుగా ఎన్టీఆర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రాం, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు, ఎల్కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్పేయి, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, మేనకాగాంధీ లాంటి పెద్ద నాయకులు టీడీపీ మహానాడుకు హాజరయ్యారు. దీంతో టీడీపీ మహానాడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.
పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు అందరూ కలిసి జరుపుకొనే పార్టీ పండుగే మహానాడు. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తారు. పార్టీ నిర్ణయాల అమల్లో ఎదురైన లాభ నష్టాలను చర్చిస్తారు. తీర్మానాలు చేస్తారు. ఎన్టీఆర్ జన్మదినమైన 28వ తేదీకి అటు, ఇటు మొత్తంగా గతంలో మూడు రోజులు మహానాడు నిర్వహించే వారు. ఇప్పుడు రెండు రోజులకే పరిమితం చేసారు. మహానాడు పార్టీకి కీలకమైన కొన్ని సందర్భాల్లో మహానాడు నిర్వహణ సాధ్యపడలేదు. 1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడు వేడుకలను టీడీపీ నిర్వహించలేదు. 1985లో మధ్యంతర ఎన్నికలు, 1995 ‘ఆగస్టు సంక్షోభం’ లో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారం దక్కించుకున్న తర్వాత 1996 మహనాడు, అలాగే 1991 మే నెలలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత పరిస్థితుల కారణంగా నిర్వహించలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, తరువాత 2020, 2021లలో కరోనా వ్యాప్తి కారణాలతో మహానాడు నిర్వహించలేదు.
ఈ సారి మహానాడుకు మరో ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తయింది. ఎన్టీఆర్ శతజయంతి. ఈ రెండు ప్రత్యేకంగా ఈ సారి మహానాడులో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణకు సంబంధించి తీర్మానాలకు ఆమోదిస్తారు. 27న పార్టీ ప్రతినిధుల సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 28న ఉదయం ఎన్టీఆర్ పార్టీ మొత్తం ఘనంగా నివాళి అర్పిస్తుంది. ఆ తరువాత ఎన్టీఆర్ శతజయంతి సభ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. దాదాపు 15 లక్షల మంది హాజర అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికలకు చంద్రబాబు సమరశంఖం పూరిస్తారు. ఆహుతులకు ఇప్పటికే చంద్రబాబు సంతకాలో ఆహ్వానాలు పంపారు.
మహానాడులో ఏర్పాటు చేసే విందుకు మరో ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏటా ఎక్కడ మహానాడు జరుగుతుందో అక్కడి వంటకాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సారి మహానాడులో గోదావరి జిల్లాతో పాటుగా పలు ప్రాంతాల నుంచి ఆత్రేయపురం పూతరేకులు, కండ్రిగ పాలకోవ, తాపేశ్వరం కాజా, మామిడితాండ్ర వంటి అనేక ప్రసిద్ధి చెందిన పదార్థాలను అక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశారు. వీటితో పాటు కోనసీమ వ్యాప్తంగా లభ్యమయ్యే అనేక వంటకాలను సైతం మహానాడు ప్రాంగణం వద్ద వండి వడ్డించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతినిధుల సభకు దాదాపు 50 వేల మంది హాజరవుతారని అంచనా. వీరందరికీ ఈ సారి కోనసీమ రుచులతో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి హాజరు కానున్న 15 వేల మంది ఈ సారి మహానాడుకు హాజరు కానున్నారు.