టీఆర్ఎస్ పై షర్మిల ఫైర్… విపక్షం లేనందువల్లే…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో జరిగిన బహిరంగ సభలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని, టీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేశామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు తనతో పాటు పాదయాత్ర చేయాలని, బంగారు తెలంగాణ కనిపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మహిళలపై లాఠీచార్జ్ చేస్తూ భూములు లాక్కుంటున్నారని, గత ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో విపక్షం లేకుండా పోయినందువలనే తాను పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు.