టీఆర్ఎస్ ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు… హోర్డింగులపై ఫిర్యాదులు…
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఈనెల 27 వ తేదీన మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ప్లీనరీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పెరుగుతున్న దూరం, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ప్లీనరీ ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించనుందని, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌లకు కనిపించడం లేదని, అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మూడోసారి కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.
ఇక ఇదిలా ఉంటే, టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా నగరమంతా గులాబీమయం అయింది. పెద్దపెద్ద హోర్డింగులు, కటౌట్‌లతో నింపేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు ఈవీడీఎం కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏప్రిల్ 20, 2020లో నగరంలో హోర్డింగులు, అక్రమ ఫ్లెక్లీలను నిషేదిస్తూ పురపాలక శాఖ జీవో 68 ని జారీ చేసింది. అయితే, ఇప్పుడు అధికార పార్టీనే డైరెక్టుగా ఇలా నగరంలో అన్ని ప్రాంతాల్లో కటౌట్లు, హోర్డింగులు పెడుతున్నారని, ఫిర్యాదులు చేస్తున్నారు. గతేడాది ప్లీనరీ సమయంలో ఈవీడిఎం డైరెక్టర్ లీవ్‌పై వెళ్లగా, ఈ ఏడాది సైతం మరోసారి ప్లీనరీకి ముందు లాంగ్ లీవ్‌పై వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తుంది.