నేడు యూసఫ్ గూడాలో ట్రాఫిక్ ఆంక్షలు… ఇదేకారణం…
ఈరోజు యూసఫ్ గూడాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యూసఫ్‌గూడాలోని టీఎస్‌పీఎస్పీ 1 వ బెటాలియన్ మైదానంలో ఈరోజు సాయంత్రం అభిమానుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనున్నది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులతో పాటు సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ పేర్కొన్నారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని, ఈ కార్యక్రమానికి పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తామని తెలిపారు. ఇక మైత్రీవనం నుంచి వచ్చే వాహనాలను యూసఫ్‌గూడా చెక్‌పోస్ట్ వైపుకు కాకుండా, సవేరా ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణకాంత్ పార్క్ మీదుగా మళ్లించనున్నారు.
జూబ్లీహిల్స్ నుంచి అమీర్‌పేట వైపుకు వెళ్లే వాహనాలను శ్రీనగర్ కాలనీ మీదుగా మళ్లించనున్నారు. ఈ వేడుకకు వచ్చే వారి కోసం మహమూద్ ఫంక్షన్ హాల్, సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా యూసఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాల, మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ లో వాహనాలను నిలిపేందుకు అవకాశం కల్పించారు. చాలా కాలం తరువాత మెగాస్టార్ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతుండటంతో అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఆచార్య లో చిరంజీవితో పాటు రామ్‌చరణ్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.