రైతులకు గుడ్ న్యూస్… భారీగా పెరిగిన టమోటా ధరలు…
ఎండలు మండిపోతుండటంతో టమోటా పంటలు చాలా వరకు ఎండిపోయాయి. దీంతో దిగుబడి తగ్గిపోయింది. 15 రోజుల క్రితం వరకు టమోటా ధరలు రిటైల్ మార్కెట్లో 10 నుంచి 15 రూపాయల వరకు పలికిన కిలో టమోటా ఇప్పుడు ఏకంగా కిలో రూ. 50 కి పైగా విక్రయిస్తున్నారు. 15 రోజులుగా టమోటా ధరలు క్రమంగా పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రోజున టమోటాలు అధికంగా పండే కుప్పం, వీ కోట, రామకుప్పం, ఏడోమైలు మార్కెట్లో 15 కిలోల బాక్సు ధర రూ. 500 నుంచి 700 వరకు పలికింది. ఇదే బాక్సు 15 రోజుల క్రితం కేవలం రూ. 70 నుంచి రూ. 90 వరకు మాత్రమే ఉండటం విశేషం.
టమోటాకు గిరాకీ పెరగడంతో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడుకు చెందిన వ్యాపారులు సైతం పోటీపడి టమోటాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో టమోటాకు గిరాకి పెరిగింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.