కరీంనగర్‌కు రేవంత్ రెడ్డి..రాహుల్ సభ కోసం…
ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతుంది. వాటిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు బీజేపీ సైతం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రలు చేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో కమలం నాయకులు అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పావులు కదుపుతుంది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు జాతీయ నేతలను రంగంలోకి దించుతున్నారు. మే 6 వ తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుటాహుటిన కరీంనగర్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశం అవుతారు. మే6 వ తేదీన నిర్వహించే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడంతో పాటు, టీఆర్ఎస్ తో పొత్తులపై వస్తున్న వార్తలపై నాయకులకు క్లారిటీ ఇవ్వనున్నారు రేవంత్. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్న తరుణంలో దీని పై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.