కాంగ్రెస్ కు పీకే దూరం… ఇదే కారణం..!!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సీనియర్ హోదాను దక్కించుకోవాలని, కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని భావించారు. అయితే, కొన్ని కారణాల వలన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. అయితే సోనియాగాంధీ కుటుంబంలో అంతర్గత పోరు, పార్టీ నేతల కుతంత్రాల కారణంగానే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నడిపించడంపై రాహుల్, ప్రియాంక గాంధీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అంతర్గతంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ప్రియాంక గాంధీ ద్వారా పీకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూశారు. ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే, మొదటిసారి జరిగిన సమావేశం తరువాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు. అటు ప్రియాంక గాంధీ సైతం విదేశీ పర్యటనలకు వెళ్లిపోయింది. పార్టీలో రాహుల్ గాంధీకి ప్రాధాన్యత తగ్గించి, ప్రియాంక గాంధీ పట్టు సాధించేందుకు పీకే ద్వారా ప్రయత్నించినట్లు కాంగ్రెస్ లో ఓ వర్గం చెబుతుంది. ఒకదశలో ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిని చేయాలని కూడా పీకే ప్రతిపాదించినట్లు కొందరు నేతలు తెలిపారు. అయితే, పార్టీపై ఉన్న పట్టుతో రాహుల్ గాంధీ తన అనుచరుల సహాయంతో విదేశాల నుంచే చక్రం తిప్పి పీకేను పార్టీలో చేరకుండా అడ్డుకున్నారని కొందరు నేతల అభిప్రాయం. సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కమిటీ సైతం పీకేను కమిటీలో సాధారణ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సూచించడంతో పీకే పక్కకు తప్పుకున్నారని నేతలు చెప్పుకొచ్చారు.