IPL: 115 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్..రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో అనూహ్య ఓటమిని చవిచూసింది. బౌలింగ్‌లో రాణించినా.. చెత్త బ్యాటింగ్‌తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 56 నాటౌట్) సంజూ శాంసన్(27) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
అనంతరం 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ మళ్లీ విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లో లైఫ్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత కెప్టెన్ డుప్లెసిస్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించగా డేంజర్ మ్యాక్స్‌వెల్ డకౌట్ ఔటవ్వడంతో ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. దినేశ్ కార్తీక్ సైతం రనౌట్ అవ్వడంతో ఆర్‌సీబీ 65 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. చివరి బ్యాట్స్ మెన్ స్వల్ప స్కోర్లకే వెను తిరగడంతో 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటయింది. ఫాఫ్ డుప్లెసిస్(23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, ప్రసిధ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో రాజస్థాన్ టేబుల్ టాపర్‌గా నిలిచింది.