నేటి నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు…కల్యాణానికి హాజరుకానున్న సీఎం
ఏపీ భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీసీతారామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనున్నది. రేపు ద్వజారోహణం నిర్వహించనున్నారు. కాగా, ఈనెల 15 వ తేదీన శ్రీసీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది.
టీటీడీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 15న జరిగే సీతారాముల కల్యాణోత్సవం కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈనెల 9 నుంచి 19 వ తేదీ వరకు 10 రోజులపాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. కాగా, ఇప్పుడు ఆరుబయట సుమారు లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది.