పాస్‌వర్డ్ షేరింగ్ కి చెక్ పెట్టిన నెట్‌ఫ్లిక్స్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. చందాదారుల సంఖ్య భారీగా పడిపోతున్న నేపథ్యంలో… దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతుంది. పాస్‌వర్డ్ షేరింగ్, యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లపై గతంలో నిరాకరించిన… కొన్ని మార్పులను ప్రస్తుతం అమలు చేయాలని యోచిస్తోంది. ఖాతాదారులు తమ పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకొనేందుకు ప్రస్తుతం ఉన్న వెసులుబాటును కుదించనున్నది. దీని ఫలితంగా ఒకే అకౌంట్‌తో పలువురు నెట్‌ఫ్లిక్స్ సేవలను వినియోగించుకొనేందుకు వీలుండదు.
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నెట్‌ఫ్లిక్స్‌కు… కొత్త సంవత్సరంలో తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 2 లక్షల మంది కస్టమర్లను ఈ కంపెనీ కోల్పోయింది. ఈ ఏడాది ఏదో ఒకటి చేసి తమ కస్టమర్ల సంఖ్యను మరో 25 లక్షలు పెంచాలని నెట్‌ఫ్లిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ టార్గెట్ మాట పక్కనపెడితే… 2 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు కోల్పోవడంతో ఆ కంపెనీకి పెద్ద షాకే తగిలింది.