సీఎం జగన్‌పై నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మంత్రి నారాయణ స్వామి సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్‌లోకి వెళ్లే సమయంలో నారాయణ స్వామి దేవుడి ఫొటోకు బదులుగా సీఎం వైఎస్ జగన్ ఫొటోను పట్టుకొని ఛాంబర్‌లోకి ప్రవేశించాడు. అందరూ అంటున్నట్టు ఇది రెడ్ల రాజ్యం కాదని, బడుగు వర్గాల రాజ్యం అని, సీఎం జగన్ బడుగుబలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. సీఎం జగన్ దేవుడు లక్షణాలున్న మానవుడు అని, అందుకే జగన్ ఫొటో పట్టుకొని ఛాంబర్‌లోకి ప్రవేశించానని అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి సీఎం ప్రాధాన్యత ఇస్తారని, కాళ్లు పట్టుకుంటేనో, కాకాపడితేనో పదువులు లభించవని అన్నారు. తప్పుచేసిన ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేసిన సమయంలో నేను బాధపడ్డానని, ఎక్సైజ్ సిబ్బంది ఎవరూ ప్రలోభాలకు లొంగవద్దని ఈ సందర్భంగా నారాయణస్వామి పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో తిరిగి రెండో సారి చోటు దక్కించుకున్నారు నారాయణ స్వామి. పాత మంత్రుల శాఖలు మారిన నారాయణ స్వామికి మాత్రం ఎక్సైజ్ శాఖ తిరిగి కట్టబెట్టారు సీఎం జగన్.