మంత్రాలయంలో పూజలు బంద్… ఇదే కారణం…
రాయలసీమలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం. ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటుంటారు. అయితే, ఏకాదశి సందర్భంగా మంగళవారం రోజున ఆలయంలో ఎలాంటి పూజలు జరగలేదు. మంత్రాలయం పీఠాథిపతి శ్రీ సుబుధీంద్రతీర్థుల ఆధ్వర్యంలో స్వామివారి సుప్రభాతం, నిర్మల విసర్జనం చేసి నిజ బృందావనానికి మంగళహారతులు ఇచ్చారు.
భక్తులు నిజ బృందావనాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే అలంకరణ, టెంకాయలు, పరిమళ ప్రసాదం, రథోత్సవం, నిత్యాన్నదానం వంటి వాటిని బంద్ చేశారు. ఏకాదశి కావడంతో పీఠాథిపతి, ఆలయంలోని అర్చకులు, ఉద్యోగులు ఉపవాసాలు పాటించారు. భక్తులు సైతం ఏకాదశి రోజున నిజ బృందావనాన్ని దర్శించుకొని తరించారు.