కేరళలో రాజకీయ దుమారం రేపిన ప్రేమవివాహం…
కేరళలోని కోజీకోడ్‌లోని ఓ ప్రేమపెళ్లి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపింది. కోజికోడ్‌కు చెందిన డీవైఎఫ్ఐ నాయకుడు షిజిన్, మరో మతానికి చెందిన జోత్స్న మేరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈనెల 10 వ తేదీన జోత్స్న ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె తండ్రి కోర్టులో హెబియస్ కార్పస్‌ను ఫైల్ చేశారు. కోర్టుకు హాజరైన జోత్స్న తాను ఇంటికి వెళ్లేందుకు సిద్దంగా లేనని, షిజిన్ ను తన ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నానని కోర్టుకు తెలియజేసింది.
దీనిపై కోజికోడ్ జిల్లా సీపీఎం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌డీపీఐ, జమాత్ ఏ ఇస్లామీ వంటి సంస్థలు లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్నాయని, ఇతర మతాలకు చెందిన బాగా చదువుకున్న యువతులను లవ్ జీహాద్ పేరుతో వివాహం చేసుకుంటున్నారని విమర్శించారు. షిజిన్ ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటే ఆ విషయాన్ని పార్టీతో ముందుగా చెప్పి ఉండాలని అన్నారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, జీవితాంతం తన మతాన్ని తాను కొనసాగిస్తానని జోత్స్న పేర్కొన్నారు.