కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు కొత్త చిక్కులు…
దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇటీవలే అనేక పార్టీల నేతలను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ లేకుండా కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం కుదరనిపని అని ఇప్పటికే అనేక పార్టీలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆప్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి పార్టీలు కాంగ్రెస్ కూటమిలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను ఢీకొట్టాలని చూస్తున్నాయి.
అంతేకాదు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో జరుగుతున్న మతహింస, విద్వేషాలపై దేశంలోని ప్రధానమైన 13 రాజకీయ పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. ఇందులో కేసీఆర్ పేరు లేకపోవడం విశేషం. 2024 ప్రధాన ఎన్నికలకు ముందు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను కలుపుకొని పోకుండా 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయడం అసాధ్యమని ఎన్సీపీ నేత శరద్‌పవార్ ఇప్పటికే స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.