ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ మధ్య వీడని చిక్కుముడి…
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉన్నది. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖంగానే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరడం వలన ఆ పార్టీకి మేలు చేకూరుతుందని, ఎన్నికల వ్యూహకర్తగా పార్టీని దేశంలో తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన వ్యూహాలు పనికొస్తాయని పార్టీలోని కొందరు నేతలు నమ్ముతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే ఆయన మిగతా పార్టీలతో ఉన్న సంబంధాలు పక్కన పెట్టాలని కొందరు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, అటు ఏపీలో వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
ఇంకా అనేక రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో పూర్తిస్థాయిలో ఉండాలి అంటే అన్ని పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. తెలంగాణలో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్‌కు పనిచేస్తే దాని ఫలితంగా కాంగ్రెస్ దెబ్బతింటుంది. తెలంగాణలో మాత్రమే కాదు అనేక రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి రావొచ్చు. అందుకే ప్రత్యర్థి పార్టీలతో కలిసి పనిచేయకూడదు అనే షరతు విధించాలని, ఆ షరతుకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్‌ను తీసుకోవాలని సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పీకే చేరిక పై సందిగ్ధత నెలకొంది.