Russia Crude Oil: భారత్‌కు భారీగా రష్యా క్రూడాయిల్..ఏప్రిల్ నుంచి..!
Russia crude oil exports India:రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు, యూరప్ దేశాలు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను చాలా వరకు నిలిపివేశాయి. ఆంక్షలు విధించాయి. అయితే, రష్యాతో మొదటి నుంచి స్నేహంగా ఉన్న భారత్‌కు ఆ దేశం భారీ ఆఫర్‌ను ప్రకటించింది. క్రూడాయిల్‌ను డిస్కౌంట్ ధరకు అందించేందుకు ముందుకు రావడంతో భారత్‌కు చెందిన పలు చమురు సంస్థలు పెద్ద మొత్తంలో రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముందు వరకు కేవలం 0.2 శాతంగా ఉన్న చమురు దిగుమతులు, యుద్ధం సమయంలో ఇచ్చిన ఆఫర్‌తో భారీగా దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది. ఒక్క మే నెలలోనే 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను రష్యా నుంచి దిగుమతి జరిగింది. ఏప్రిల్ నెల నుంచే దిగుమతులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భారత్‌కు ముడి చమురును అధికంగా అందించే దేశాల్లో రష్యా రెండో స్థానానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఇరాక్ మించి రష్యా ముడిచమురును ఇండియా దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ సంస్థలు రష్యా నుంచి 40 శాతం మేర క్రూడాయిల్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ రష్యా 30 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తుండటంతో భారత్‌కు చెందిన రిఫైనరీలు రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి.