సాధారణంగా మే నెలలో మొదటి వారం పదిరోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ తరువాత ఎండ తగ్గిపోతుంది. కానీ, ఈ ఏడాది మే మొదటి వారం నుండే కాదు...ఈ నెలాఖరు వరకు ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు సగటున 1.5 డిగ్రీలు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు.
Weather Changes: సాధారణంగా మే నెలలో మొదటి వారం పదిరోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ తరువాత ఎండ తగ్గిపోతుంది. కానీ, ఈ ఏడాది మే మొదటి వారం నుండే కాదు…ఈ నెలాఖరు వరకు ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు సగటున 1.5 డిగ్రీలు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న భూతాపం
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వేడి, వడగాల్పులతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వేడి పెరిగిపోతున్నది. పశ్చిమ ప్రాంతం నుండి వడగాల్పులు వీస్తున్నాయి. రాజస్థాన్ గుజరాత్ మీదుగా గాలులు వీస్తుండటం, మోచా తుఫాన్ ధాటికి గాలిలోని తేమ హరించుకుపోవడంతో ఉక్కపోత, వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. దీనికి తోడు కర్భన వాయువులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూతాపం పెరుగుతున్నది.
పెరిగిన జీవన ప్రమాణం…
ప్రపంచంలో మనిషి జీవన ప్రమాణం పెరిగిపోతున్నది. ఆదాయం పెరుగుతుండటంతో లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఫ్యాన్లు ఏ విధంగా ఉండేవో, ఇప్పుడు ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్‌లు ఆ విధంగా మారిపోయాయి. వీటి వాడకం పెరడగంతో విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ తయారీ కోసం కోల్‌ను ఎక్కువగా మండిస్తున్నారు. దీని ఫలితం వాతావరణంలో వేడి. ఇదొక కారణమైతే, ఏసీలు వాడకం సమయంలో వాటి నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలో వేడిని పెంచుతాయి. ఈ వాయువులు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఏసీల వాడకం పెరిగితే భూమిపై సగటున 1.8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది.
రాబోయే ఐదేళ్లు…
2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల పాటు భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇప్పటి వరకు చరిత్రలో నమోదైన ఉష్ణగ్రతల కంటే, రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. ఎల్‌నినో ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలానే ఉష్ణోగ్రతలు పెరిగితే భూమిపై జనాభా మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన చెందుతోంది. వేడి పెరగడం వలన వర్షాలు సకాలంలో కురిసే అవకాశం ఉండదు. వర్షాలు లేకుంటే పంటలు, త్రాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఫలితంగా నీటికోసం యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి నీటిబొట్టు బంగారంతో సమానంగా మారే అవకాశం ఉంటుంది. తిండి గింజల కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని, ప్రపంచంలో సగానికి పైగా జనాభ ఆహార కొరతతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే ఉష్ణోగ్రతల ప్రభావం.. పర్యావరణంపై తీవ్రంగా పడే ప్రమాదం ఉందని, వాటిన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూఎంవో చీఫ్ పెట్టెరి టలాస్ పేర్కొన్నారు. వీటన్నింటిని ఎదుర్కొనేందుకు ప్రజలు సదా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.