భారత్… బ్రిటన్ మధ్య భారీ ఒప్పందాలు…!
భారత్ బ్రిటన్ మధ్య భారీ ఒప్పందాలు జరగబోతున్నాయా అంటే అవునని చెబుతున్నాయి భారత ప్రభుత్వ అధికార వర్గాలు. రెండు దేశాల మధ్య సాఫ్ట్‌వేర్ రంగం నుంచి ఆరోగ్యం వరకు భారీ ఒప్పందాలు జగరబోతున్నాయి. ఈరోజు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని మోడీ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో భాగంగా భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించనున్నారు. సుమారు ఒక బిలియన్ పౌండ్ ను మొదట పెట్టుబడిగా పెడతారని అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. 5జీ, కృత్రిమ మేథ, ఆరోగ్యపరిశోధన, పునరుత్పాదక ఇంధన వనరులు, రక్షణ రంగ ఉత్పత్తులు వంటి అనేక అంశాలపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు వాతావరణంలో వస్తున్న మార్పులు, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంశాలపై కూడా ఇరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 2030 నాటికి భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని బ్రిటన్ హైకమీషనర్ పేర్కొన్నారు.
అయితే, లండన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి వారిని భారత్‌కు రప్పించే విషయంపై చర్చిస్తారా అనే ప్రశ్నకు, ఇప్పటికే న్యాయస్థానాల ద్వారా వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇరు నేతల మధ్య ఈ విషయంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చని, ఇండో పసిఫిక్ ప్రాంతం పై ప్రధానంగా చర్చజరిగే అవకాశం ఉండోచ్చని విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి బాగ్చి విలేఖరులకు తెలిపారు. ఏయే అంశాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చిస్తారు అనేది స్పష్టంగా చెప్పలేమని, పరిస్థితులకు అనుగుణంగా ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని బాగ్చి తెలిపారు.