బంగారానికి తగ్గిన గిరాకి… ఇదే కారణం…
మనదేశంలో బంగారానికి ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా పుత్తడిని దిగుమతి చేసుకునే దేశాల్లో మనదేశం కూడా ఒకటి. అయితే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పుత్తడి ధరలు అమాంతం పెరగడంతో గిరాకీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. డిమాండ్ ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రపంచ స్వర్ణమండలి తన నివేదికలో పేర్కొన్నది. జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం గిరాకి 18 శాతం పడిపోయి 135.5 టన్నులకు పడిపోయిందని నివేదికలో పేర్కొన్నది. గతేడాది ఇదే త్రైమాసికంలో 165.8 టన్నులుగా ఉన్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి తెలియజేసింది. ఇక జనవరి నుంచి మార్చి వరకు తులం బంగారం ధర 8 శాతం పెరిగి రూ. 45,434కి చేరుకుంది. అయితే, గతేడాది ఇదే త్రైమాసికంలో తులం బంగారం ధర. 42,045గా ఉన్నట్టు ఆ డబ్ల్యూజీసీ తెలియజేసింది. ఈ ఏడాది మొత్తానికి పుత్తడి డిమాండ్ 800 నుంచి 850 టన్నుల స్థాయిలో ఉండొచ్చని డబ్ల్యూజీసీ నివేదికలో తెలియజేసింది.