టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై జరిమానాలు… ఎంతంటే…
టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీన హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం కోసం నగరంలోని అనేక ప్రాంతాల్లో జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అయితే, అక్రమ ఫ్లెక్సీలు, హోర్డింగులపై గతేడాది జీహెచ్ఎంసీ జీవో 68ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తే భారీ జరిమానాలు విధించాలని జీవోలో పేర్కొన్నారు. కాగా, టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడంపై ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ ఈవీడీఎంకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ప్రకారం ఈవీడీఎం జరిమానాలు విధించారు.
మంత్రి తలసానికి రూ. 50 వేలు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీకి రూ. 65 వేలు, మైనంపల్లి రోహిత్‌కు రూ. 40 వేలు, దానం నాగేందర్‌కు రూ. 5 వేలు, కాలేరు వెంకటేష్‌కు రూ. 10 వేలు జరిమానాలు విధించారు. అయితే, ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులకు మాత్రమే ఫైన్లు వేసి చేతులు దులుపుకున్నారని, నగరంలో అక్రమంగా వందలాది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, జీహెచ్ఎంసీ వాటిపై ఎలాంటి జరిమానాలు విధించలేదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.