ద్వారకా తిరుమలలో ఉద్రిక్తత…వైసీపీ ఎమ్మెల్యే పై దాడి..!
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జి కొత్తపల్లిలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జి కొత్తపల్లి గ్రామ ప్రెసిడెంట్, వైసీపీ నేత గంజి ప్రసాద్‌ను కొంతమంది దుండగులు నరికి చంపి ఊరుచివర పడేశారు. ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హుటాహుటిన మృతి చెందిన గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జి కొత్తపల్లికి వెళ్లారు. అయితే, గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యేకు ఊహించని ఘటన ఎదురైంది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావును గ్రామస్తులు అడ్డుకున్నారు. గంజి ప్రసాద్ మృతికి ఎమ్మెల్యేనే కారణం అంటూ గ్రామస్తులు ఆయనపై తిరగబడ్డారు. ఎమ్మెల్యేపై దాడి చేశారు.
దీంతో తలారి వెంకట్రావుకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూశారు. అయితే, ఆ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గ్రామస్తులు గుమిగూడారు. ఎమ్మెల్యే ను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావును సురక్షితంగా ఆ గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.