ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మద్దతు…
2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే పోటీ మొదలైంది. గత ఎన్నికల సమయంలో కేంద్రంలో చక్రం తిప్పాలి అనుకున్న వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు అనుకోని విధంగా దెబ్బతగిలింది. ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే కేంద్రంలో తమకు అవసరమైన పార్టీకి మద్ధతు ఇవ్వొచ్చని అనుకున్నారు. కానీ, 2019 ఎన్నికల్లో ఎన్డీయేకి అవసరమైన దానికంటే ఎక్కువ సీట్లు రావడంతో పార్టీల ఆశలు గల్లంతయ్యాయి. అయితే, ఈసారి సమీకరణాలు మారుతుండటంతో వైసీపీ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.
కేంద్రంలో ఎన్నికలు పూర్తయ్యాక తమ సంఖ్యాబలం అవసరం అనుకునే ఏ కూటమికైనా మద్దతిస్తామని, అంతకంటే ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై రాసి ఇవ్వాలని అలా ఇస్తేనే మద్దతు ఇస్తామని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని అన్నారు. ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి వ్యూహకర్తగా మాత్రమే పనిచేస్తున్నారని, ఆయన ఆలోచనలను మాత్రమే వాడుకుంటామని పేర్నినాని పేర్కొన్నారు.