ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..ఉద్యోగులకు బంపర్ ఆఫర్..!
ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సరిబేసి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ కాలుష్యం తగ్గలేదు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నా కాలుష్యం దిగిరావడం లేదు. దీంతో ఢిల్లీ సర్కార్ రంగంలోకి దిగింది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు నడుంబిగించింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సర్కార్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొదటి 10 వేలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సర్కార్ ఉద్యోగులకు ప్రోత్సాహకం కింద రూ. 5000 అందించాలని నిర్ణయించింది. అదేవిధంగా మొదటి వెయ్యి వాహనాలు కొనుగోలు చేసిన వారికి అదనంగా మరో రూ. 2000 అందించాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు ఈఎంఐ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా వాయుకాలుష్యాన్ని తగ్గించాలని ఢిల్లీ సర్కార్ భావిస్తున్నది.