IPL: కోల్‌కతా పై ఢిల్లీ ఘనవిజయం
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ..చివరి వరకు తడబడ్దా ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (33 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ పై మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది ఢిల్లీ కేపిటల్స్. ఫలితంగా 4 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో డేవిడ్ వార్నర్ (42), మధ్యలో లలిత్ యాదవ్ (22), అక్షర్ పటేల్ (27) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (3/24) ఆరంభంలోనే వికెట్లు తీసి కేకేఆర్ విజయం పై ఆశలు రేకెత్తించాడు. రాణా, నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు కుల్దీప్ యాదవ్ (4/14) తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్‌ను దెబ్బ కొట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. నితీశ్ రాణా (33 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57), శ్రేయస్ (37 బంతుల్లో 42) రాణించడంతో కేకేఆర్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో ముస్తాఫిజుర్ (3/18) కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.