చైనాకు లొంగని కోవిడ్ మహమ్మారి… విలవిలలాడుతున్న ప్రజలు…
చైనాలో కోవిడ్ భారీస్థాయిలో విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి చైనా జీరో కోవిడ్ విధానాన్ని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యంత పెద్ద నగరమైన షాంగైలో కరోనా కట్టడికి గత 15 రోజులుగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అధికారులు అనుమతించడం లేదు. దీంతో ఆహారకొరతను ఎదుర్కొంటున్నారు. సుమారు 2.6 కోట్ల మంది జనాభా కలిగిన షాంగైలో 60 ఏళ్లు పైబడిన వారు 58 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. మందులు తీసుకొచ్చుకోవడానికి కూడా అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శులు ఎదురవుతున్నాయి.
కోవిడ్ కేసులు నమోదవుతున్న నగరాల్లో ఆంక్షలు సడలించేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్ ససేమిరా అంటున్నారు. షాంగైలోనే 23 వేల కొత్త కేసులు నమోదుకావడం విశేషం. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక రంగంపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ రంగంపై కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాంగైతో పాటు సుమారు 15 నగరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారని, ఆహారంలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్దపడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు చైనా అధికారిక పత్రికలో సైతం ఇలాంటి వార్తలు వస్తుండటంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకొవచ్చు.