నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర… ఎక్కడి నుంచి ప్రారంభమంటే…
ఈరోజు నుంచి తెలంగాణలో రెండో విడత పాదయాత్ర చేసేందుకు బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ సిద్ధం అవుతున్నారు. అలంపూర్‌లోని జోగులాంబ శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకొని పాదయాత్రను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అలంపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకుంటారు. అలంపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం మొదటిరోజు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనున్నది.
అలంపూర్ నుంచి ఇమ్మాపూర్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రజా సంగ్రామ పాదయాత్రను చేపడుతున్నారు. గతేడాది డిసెంబర్ నెలలోనే రెండో విడత పాదయాత్ర చేపట్టాల్సి ఉన్నా, కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అధికార పార్టీ ఆగడాలను, వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్రను చేపట్టనున్నారు.