వాసిరెడ్డి పద్మ నోటీసులు చిత్తు కాగితాలతో సమానం..!
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అమ్మాయి మీద మూడు రోజులు అత్యాచారం జరిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పైగా పరామర్శకి వెళ్ళిన ప్రతిపక్ష నేత చంద్రబాబు పై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మహిళా కమీషన్ పేరుతో వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులు చిత్తు కాగితాలతో సమానం అన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని ఆయన ఎలాంటి విచారణకు హాజరవ్వరన్నారు అచ్చెన్నాయుడు.
జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నాడని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో జగన్ వైఫల్యం చెందాడని అప్పులతో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని జోస్యం చెప్పారు అచ్చెన్నాయుడు. పవన్ కల్యాణ్ కి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతున్నరన్నారు. పవన్ కల్యాణ్ ని ఎదుర్కోలేక దత్తపుత్రుడని ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న.