మాజీ మంత్రుల సాయం కోరుతున్న తాజా మంత్రులు..!
కొత్త కెబినెట్ కొలువు తీరాక ఏపీ సెక్రటేరియెట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏ అధికారి ఎలా ఉంటారు. గతంలో ఎలా ఉండేవారు ఇప్పుడెలా ఉంటున్నారనేది ఆ చర్చల సారాంశం. మాజీ మంత్రులు.. కొత్త మంత్రులు కలిస్తే మాత్రం కచ్చితంగా అధికారుల తీరు ప్రస్తావనకు వస్తోందట. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారుల తీరుపై ఆసక్తిగా చర్చ సాగుతున్నట్టు సమాచారం. అధికారుల తీరు వల్ల ఎదురైన ఇబ్బందులను.. కొత్త అమాత్యులతో పంచుకుంటూ.. ఆ ఆఫీసర్‌తో జాగ్రత్త.. ఈ అధికారిని కంట్రోల్‌లో పెట్టాలి అని అప్పగింతలు చేస్తున్నారట మాజీ మంత్రులు.
ఈ క్రమంలోనే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తాజా మాజీ మంత్రి పదవిలో ఉండగా.. ఓ అధికారిణి ప్రవర్తించిన తీరు.. ఆమె ఆ మాజీ మంత్రిని వెయిట్ చేయించిన ఉదంతంపై సచివాలయంలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. కేబినెట్ ప్రక్షాళనపై చర్చ జరుగుతున్న సమయంలో ఫలానా వాళ్లు మంత్రి పదవుల్లో ఉండబోరనే అంచనాలతో ఆ అధికారిణి తన శాఖకు చెందిన మంత్రిని అస్సలు పట్టించుకోవడం మానేశారట. మినిస్టర్ ఏం చెప్పినా లైట్ తీసుకున్నారట. ఓ రోజు తన శాఖకు చెందిన అధికారులతో మంత్రి సమీక్ష చేస్తుంటే ఉద్యోగులంతా వచ్చారు కానీ.. ఆ శాఖకు ముఖ్యకార్యదర్శి హోదాలో ఉన్న ఆ లేడీ ఆఫీసర్ మాత్రం ఎంతసేపైనా రాలేదట. పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన ఆ లేడీ ఆఫీసర్ ప్రస్తుతం శాఖ మారినా.. ఆమె వ్యవహరించిన తీరు మాత్రం నేటికీ హాట్ టాపిక్కే.
కేబినెట్‌లో చోటు పదిల పర్చుకున్న ఓ మంత్రికి అధికారుల నుంచి ఎదురైన ముచ్చట ఇంకో లెవల్లో ఉందట. ఆ మంత్రి అప్పుడూ ఇప్పుడూ ఒకే శాఖ చూస్తున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆ మంత్రి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందు నుంచే ఆ శాఖకు చెందిన స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ టచ్‌లో లేకుండా పోయారట. ఇక కమిషనర్ స్థాయి అధికారి అయితే.. ఆ నాయకుడు మంత్రిగా మళ్లీ వచ్చినా కనీసం ఫోన్ చేయలేదట. అప్పుడూ ఇప్పుడూ ఆ ఆఫీసర్‌తో తలపోట్లు తప్పడం లేదని సదరు అమాత్యులు వారు వాపోతున్నారట. ఇటీవలే ఆ అధికారి వచ్చి మంత్రిని కలిసిన సందర్భంలో ఆసక్తికర సంభాషణ జరిగిందట. ఏం సార్.. ఇక నేను రానని అనుకున్నారా..అని ఆఫీసర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారట మినిస్టర్. మంత్రిగా ఉండబోనని.. హ్యాపీగా ఫీలయ్యారా అని వెంటనే మరో ప్రశ్న సంధించారట. దాంతో ఆ అధికారి బిత్తరపోయినట్టు సమాచారం. ప్రస్తుతం మాట వినని అధికారుల భరతం పట్టాలనే ఆలోచనలో ఉన్నారట మంత్రిగారు.