నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన…
ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వైఎస్సార్ సున్నా వడ్డీ కింద మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బందర్ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి చేరుకొని, ఇటీవలే వివాహం జరిగిన నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి 1:45 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
వైఎస్ జగన్ ఒంగోలు పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనకు వెళ్లిన సమయంలో టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఒంగోలు పర్యటన సందర్భంగా మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.