నేటి నుంచి ఏపీలో పదోతరగతి పరీక్షలు… నిమిషం ఆలస్యమైనా…
ఈరోజు నుంచి ఏపీలో పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈరోజు నుంచి మే 9 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 3776 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు ఉదయం 9:30 గంటలలోగా తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో ఉండాలి. 9:30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.
ఒక్కో క్లాస్‌రూమ్‌లో కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసేలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేసేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను, 292 సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. పరీక్షలు జరిగే కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించాలని, విద్యుత్ కు అంతరాయం కలగకుండా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు హాల్‌టికెట్ చూపి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.