Zika Virus: దేశంలో మళ్లీ జికా కలకలం..మహారాష్ట్రలో బయటపడ్డ కేసులు
Zica Virus: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే దేశంలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. వాతావరణంలో మార్పులు రావడం, వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులతో పాటు జికా వైరస్ కేసులు కూడా బయటపడుతున్నాయి. మహారాష్ట్రలోని ఘర్ అనే జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏడెస్ అనే దోమ ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, ప్రజలు దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
వర్షా కాలంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. దోమ కాటు వలన డెంగీ, మలేరియా వంటి వైరల్ జ్వరాలు కూడా సోకుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దోమల నుంచి రక్షణ పొందే సాధనాలను వినియోగించాలని సూచిస్తున్నారు . జికా వైరస్ సాధారణ వైరల్ ఫీవర్ మాదిరిగానే కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.