Food Poisoning: కేరళలో విషాదం, బిర్యానీ తిన్న యువతి మృతి
Woman dies allegedly due to food poisoning after consuming Biryani
కేరళలో విషాదం చోటుచేసుకుంది. బిర్యానీ తిన్ని ఓ యువతి చనిపోయింది. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఈ రోజు ప్రాణం విడిచింది. ప్రస్తుతం ఆమె శవానికి పోస్టు మార్టమ్ జరుగుతోంది. ఆ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ దర్యాప్తుకు ఆదేశించారు. అదే విధంగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌ను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే రిపోర్టు అందించాలని ఆదేశించారు.
ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న హోటళ్ల లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం రద్దు చేయడం జరుగుతుందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ హెచ్చరించారు.
కుజుమంతీ అనే పేరు గల బిర్యానీని 20 ఏళ్ల యువతి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. కాసర్‌గడ్ రోడ్డులో ఉండే రొమాన్సియా అనే హోటల్ నుంచి డిసెంబర్ 31న ఆమె ఆర్డర్ చేసినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. బిర్యానీ తిన్న తర్వాతి నుంచి అస్వస్థకు గురైన ఆమె చికిత్స పొందుతూనే ఉంది. మొదట కేరళలో చికిత్స అందించిన తర్వాత ఆమెను కర్ణాటకలోని మంగళూర్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించింది.
ఇటీవలే కొట్టాయంలోని మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఓ నర్సు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మరణించింది. కోజికోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మరవకముందే 20 ఏళ్ల యువతి మరణించడం సంచలనంగా మారింది.