Winter Session: రేపటి నుంచి పార్లమెంట్.. నేడు అఖిలపక్ష భేటీ
Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం రేపటి నుండి నుంచి ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల సెషన్‌లో 17 సభలు జరగనున్నాయి. సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ సారి సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని పిలవాలని నిర్ణయించారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా మాట్లాడుతూ, సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాల సహకారం కోరుకుంటున్నదని ఈ సమావేశాల నిర్వహణలో ప్రతిపక్షాలు కూడా సానుకూల పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఉభయ సభల ముందుకు 16 బిల్లులను తీసుకురానున్నది. మరో వైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. ఈ భేటీలో ప్రధాని మోదీ సైతం పాల్గొనే అవకాశం ఉంది. సమావేశాల్లో ముఖ్యమైన అంశాలు పార్లమెంట్ వ్యవహారాలపై చర్చించేందుకు ఆయన ఆహ్వానాలు పంపారు.
సభలో కేంద్ర ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పెట్టేందుకు కాంగ్రెస్ ఈ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించనుంది. భారత్-చైనా సరిహద్దు వివాదం, రాజ్యాంగ సంస్థలలో ప్రభుత్వ జోక్యంతో పాటు ఆర్థిక సమస్యల కింద ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జీఎస్‌టీ సమస్యలను కాంగ్రెస్ లేవనెత్తుతుంది. రైతులకు ఎమ్మెస్పీ చట్టం హామీ అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ జోడో యాత్ర కారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరుకాలేకపోతున్నారు.