కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాక రేపుతున్నాయి. ఆ రాష్ట్ర డీజీపీగా పనిచేసిన ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా నియామకం కావడం చర్చనీయాంశంగా మారింది.
CBI NEW DIRECTOR : ఒకే ఒక్క కర్ణాటక (Karnataka) ఎన్నికల ( ) ఫలితం (result). 10ఏళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీపై (Bjp) అనుమానపు మేఘాలు కమ్ముకునేలా చేసింది. ఓటమికి రకరకాల కారణాలు చెబుతున్నా కమలనాథులను అంతర్మథనంలో పడేసింది. కన్నడ ప్రజల తీర్పుతో కాషాయ దళం ఎలాంటి ఎత్తుగడలు (tactics and moves) సిద్ధం చేస్తోంది? దిద్దుబాటు చర్యలు ఏం చేపడుతుంది? అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ నిర్ణయాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సీబీఐ (cbi), ఈడీ (ed) రంగంలోకి దిగి దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. అటు గవర్నర్లు కూడా తమ వంతు పాత్ర నిర్వర్తిస్తూ బీజేపీ యేతర ముఖ్యమంత్రులను ఇరుకున పెడుతున్నారు. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లు వివాదాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ దూకుడు తగ్గిస్తుందా? సీబీఐ, ఈడీ, గవర్నర్ల ప్రయోగాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతుందా? లేదంటే కర్ణాటకతో కలిపి మరింత వేడి పుట్టిస్తుందా? అనే చర్చ జరుగుతోంది.
గవర్నర్లు-వివాదాలు
బీజేపీ యేతర రాష్ట్రాల్లో పాలనకు గవర్నర్లు (governers) అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రులు (chief ministers) పదేపదే ఆరోపిస్తున్నారు. బిల్లులకు రాజ్భవన్లు మోకాలడ్డుతున్నాయని ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టు (supreme court) గడపను తొక్కాయి. గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపడం లేదని తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారాల పేరుతో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ వేశాయి. ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను తొక్కిపట్టరాదని తేల్చి చెప్పింది. అలాగే ప్రజలు ఎన్నుకున్న పాలకులకే అధికారాలు ఎక్కువ ఉంటాయని కుండబద్దలు కొట్టింది. మరోవైపు కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోనూ అలాంటి, అంతకు మించి వివాదాలు రాజుకున్నాయి. గవర్నర్ కార్యాలయాలు సీఎంఓ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారాయి. యూనివర్సిటీలకు వైస్ఛాన్సర్లుగా వ్యవహరించే గవర్నర్లు పాలకులను ఢీ కొట్టారు. మరి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఈ అపవాదు నుంచి బయటపడేందుకు బీజేపీ పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.
సీబీఐ, ఈడీ-వేడి తగ్గుతుందా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో అపవాదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (Investigating agencies ) దుర్వినియోగం. ఈ వ్యవహారం ఇటీవలే సుప్రీంకోర్టుకు చేరింది. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగిస్తూ కేంద్రం బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ సహా 14 ప్రతిపక్ష పార్టీలు (oppositions) పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2013-14 నుంచి 2021-22 వరకు సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసులలో 600 శాతం పెరిగాయని విపక్షాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. 121 మందిని విచారిస్తే అందులో 95 శాతం మంది ప్రతిపక్ష నేతలే ఉన్నారని తెలిపాయి. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. విచారణ ఉండకూడదని నాయకులను దూరంగా ఉంచగలరా? అని ప్రశ్నించింది. రాజకీయ నాయకుడు ప్రాథమికంగా పౌరుడే అని అందరూ ఒకే చట్టానికి లోబడి ఉంటారని తెల్చిచెప్పింది. ప్రతిపక్షాల పిటిషన్‌ను తిరిస్కరించగా ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోనూ సీబీఐ మరింత దూకుడు పెంచి కాంగ్రెస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? అనే చర్చ తెరపైకి వచ్చింది.
కర్ణాటకలో కాకరేపుతారా..?
కన్నడనాట విజయం సాధించి దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీబీఐ వేడి మరింత తగిలేలా కనిపిస్తోంది. ఆ రాష్ట్ర డీజీపీ (Dgp) ప్రవీణ్ సూద్ (Praveen Sood) సీబీఐ డైరెక్టర్‌గా (cbi director) నియామకం కావడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రవీణ్ సూద్ 2020 నుంచి మూడేళ్లుగా కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చూశారు. బీజేపీ ప్రభుత్వానికి వంత పాడుతూ తమ నేతలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టారనేది ఆయనపై కాంగ్రెస్ ఆరోపణ. ఎన్నికల సమయంలోనూ ఇదే ప్రస్తావించారు. తాము అధికారంలోకి రాగానే అతనిపై చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ విజయం సాధించడంతో ప్రవీణ్ సూద్‌ను లూప్లైన్లో పెట్టడం ఖాయమని అందరూ భావిస్తుండగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ఫలితాల మరుసటి రోజే అతన్ని సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ప్రవీణ్ సూద్‌పై వ్యతికేత చూపిస్తన్న కాంగ్రెస్ పార్టీ అతన్ని సీబీఐ డైరెక్టర్ గా ఎలా అంగీకరించిందనే చర్చ జరుగుతోంది. ఎంపిక కమిటీలో ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి అధిర్ రంజన్ (Adhir Ranjan) భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్ నియామకానికి త్రిసభ్య కమిటీ ఉన్నప్పటికీ తుది నిర్ణయం కేంద్రం చేతిలోనే ఉండమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కర్ణాటకలో విపక్షాలను అణచివేసేలా వ్యవహరించారని ప్రవీణ్ సూద్‌పై ఆరోపణలు ఉండగా.. వినూత్నమైన కార్యక్రమాలతో పోలీస్ శాఖలో తనదైన ముద్రవేశారు.
డీకే శివకుమార్‌పై కేసులు
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు (Karnataka pcc chief) డేకీ శివకుమార్‌పై (Dk Shivakumar) 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో అక్రమాస్తుల కేసు ప్రధానమైనది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు ఈ నెల (May) 30న విచారణకు రానుంది. 2020-23 మధ్య డీకేపై 13 కేసులు నమోదయ్యాయి. 2013-18 మధ్య మంత్రిగా అక్రమాస్తులు సంపాదించారని అభియోగాలు ఉన్నాయి. ఐటీ దాడుల్లో రూ.9.59 కోట్ల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగంలోకి దిగిన ఈడీ (ed) మనీలాండరింగ్ (money laundering) కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఇదే కేసులో తిహార్ జైలులో శివకుమార్ ఉండగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పరామర్శించారు. తాజాగా కర్ణాటక డీజీపీగా పనిచేసిన ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా నియామకం కావడం ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే అతనికి కేంద్ర దర్యాప్తు సంస్థ బాధ్యతలు అప్పగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధిర్ రంజన్ చౌదురి ప్రతిపక్ష నేతగా కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. శివకుమార్‌ను ముఖ్యమంత్రి పదవి పోటీ నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ కూడా ప్రవీణ్ సూద్ నియామకానికి ఆమోదం తెలిపిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.