Himachal Pradesh: హిమాచల్ సీఎం విషయంలో హైకమాండ్‌దే ఫైనల్
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈక్రమంలో ప్రధానంగా ముగ్గురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మొదటి స్థానంలో ఉన్న పేరు ప్రతిభా సింగ్.. రెండో స్థానంలో ఉన్న పేరు సుఖ్విందర్ సింగ్ సుఖూ.. మూడో స్థానంలో ఉన్న పేరు ముకేశ్ అగ్నిహోత్రి ఈ లిస్టు ఇంతటితో ఆగేనా అంటే పెరుగుతూ పోతుంది. హిమాచల్ పీసీసీ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్ రాథోర్, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా కుమారి, మాజీ హిమాచల్ పీసీసీ చీఫ్ కౌల్ సింగ్ ఠాకూర్ లు కూడా సీఎం సీటు కోసం పోటీపడుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి ఎంపిక ఇప్పుడు తలనొప్పిగా మారింది. నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పేరు ఖరారు కాలేదు. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పేరు వెల్లడిస్తారని అంత అనుకున్నారు..కానీ సీఎం క్యాండెట్ ఎవరని తేల్చలేదు. ఆశావహులు ఎక్కువవుతుండడంతో.. సీఎం పదవిపై తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు రాష్ట్ర నేతలు. ఇక హిమాచల్ సీఎం ఎవరనేది దిల్లీ హైకమాండ్ నిర్ణయిస్తుంది.
రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, అబ్జర్వర్ భూపేష్ బఘేల్, భూపేంద్ర సింగ్ హుడా ఎమ్మెల్యేలతో మాట్లాడి రాహుల్ గాంధీ, ప్రియాంకలతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాతే సీఎంను నిర్ణయిస్తారని తెలిపారు. ఇప్పటికే మేధోమథనాలు మొదలయ్యాయి అయితే చివరికి హిమాచల్ సీఎం పీఠం ఎవరికీ దక్కేనో రెండు రోజులు వేచి చూడాల్సిందే.