2000 Currency Notes: 2016 నవంబర్ 8న అర్థరాత్రి సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ (PM Modi). పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 500, రూ. 1000 నోట్లను బ్యాన్ చేసి.. వాటి స్థానంలో రూ. 500 రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
2000 Currency Notes: 2016 నవంబర్ 8న అర్థరాత్రి సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ (PM Modi). పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 500, రూ. 1000 నోట్లను బ్యాన్ చేసి.. వాటి స్థానంలో రూ. 500 రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రధాని ప్రకటనతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. జనాలు కన్ఫ్యూజన్లో పడిపోయారు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులకు క్యూ కట్టారు. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు మూడు నెలలు జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ ఈసారి మొదటిసారి జరిగినంత గందరగోళం ఏర్పడలేదు. ఇది సంచలన నిర్ణయమే అయినప్పటికీ.. జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతా కూల్‌గా ఉండిపోయారు.
అందుకు కారణం కూడా లేకపోలేదు. దాదాపు రెండేళ్ల క్రితం నుంచే రూ. 2 వేల నోట్ల సర్క్యులేషన్ ఆగిపోయింది. ఎక్కువగా రూ. 500 నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేయడం 2018లోనే ఆపేసింది. బ్యాంకులు కూడా కస్టమర్లకు రెండు వేల నోట్లను ఇవ్వడం దాదాపు ఆపేశాయి. అందుకే ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఎక్కువగా గందరగోళం ఏర్పడడం లేదు.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 3.52 లక్షల కోట్ల 2 వేల నోట్లు చలామణీలో ఉన్నట్లు ప్రకటించింది. అటు ఆర్థిక నిపుణులు మాత్రం కేవలం 10 శాతం నోట్లు మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో మిగతా డబ్బంతా ఎక్కడ పోయింది?.. ఎవరి దగ్గర ఆ డబ్బంతా ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా ఆ నోటు కనిపించడం లేదని, ఇప్పుడు ఆర్బీఐ వెనక్కి తీసుకోవడం ద్వారా వచ్చే నష్టం ఏముందని కొందరు నిలదీస్తున్నారు.
అయితే ఆ డబ్బంతా రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగుల వద్దే ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటుకు నోట్లను పంపణీ చేయడం కోసం పెద్ద ఎత్తున బ్లాక్ మనీని దాచి పెట్టారని అంటున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా లంచం రూపంలో వచ్చిన అక్రమ సొమ్మునంతా రూ.2 వేల నోట్ల రూపంలో పోగు చేసుకున్నారని.. వారికి ఇప్పుడు పెద్ద బొక్క పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలో గత నోట్ల రద్దు సమయంలో వారికి అనుభవం వచ్చిందని.. ఆర్బీఐ నిర్ణయం వారిపై పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు.