RVM: రిమోట్ ఓటింగ్ మిషన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
What is the new RVM proposal of EC and how it will work
కేంద్ర ఎన్నికల సంఘం మన దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. కొత్త ఆలోచనలు, విధానాలతో ముందుకు వస్తోంది. ఇప్పటి వరకు ఓటింగ్ కు దూరంగా ఉన్న వారిని ఓటింగ్ లో పాల్గొనేలా చర్యలు చేపడుతోంది. రిమోట్ ఓటింగ్ అనే విధానాన్నిఅవలంభించాలని భావిస్తోంది. కొంత కాలంగా ఈ విధానంపై కసరత్తు చేసింది. రిమోట్ ఓటింగ్ చేసేందుకు కొ్త్త ఈవీఎంలను తయారు చేయించింది. వాటినే RVM అనే పేరుతో పిలుస్తోంది.
పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలసల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న పలు వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఈసీ రిమోట్ ఓటింగ్ విధానానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. అలాంటివారు ఓటింగ్ లో పాల్గొనేలా సదుపాయం కల్పించేందుకు ఈసీ నిర్ణయించింది. రిమోట్ ఓటింగ్ మెషిన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రిమోట్ ఈవీఎంలను ఈసీ తయారు చేయించింది. RVMలను దేశంలో వివిధ నియోజకవర్గాలలో ఉపయోగించాలని భావిస్తోంది. ఎన్నికల సమయంలో తమ స్వస్థలాలకు రాలేకపోతున్న వారికి RVMల ద్వారా ఓటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఈ ఏడాదిలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి సారిగా కొన్ని రాష్ట్రాలలో RVM లను ప్రయోగాత్మకంగా వినియోగించాలని భావిస్తోంది. లోటుపాట్లు తెలిసిన తర్వాత వాటిని సరిచేసి లోక్ సభ ఎన్నికల్లో కూడా RVMలను వాడాలని భావిస్తోంది.
ఈ విధానం ద్వారా ఓటు హక్కు పొందాలని అనుకుంటున్న ఓటర్లు తమ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ అధికారికి తమ వివరాలను తెలియజేయల్సి ఉంటుంది. వారు ఇచ్చిన వివరాలను అనుసరించి ఓటరు ఉండే ప్రాంతంలోనే RVMలను ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంటుంది. RVMలలో అనేక ఆప్షన్లు ఉంటాయి.
ఓటరు తనకు చెందిన నియోజకవర్గానికి చెందిన సమాచరం ఇవ్వగానే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్ధులు, వారి ఎన్నికల గుర్తులు RVMలో డిస్ ప్లే అవుతాయి. దానినే డైనమిక్ బ్యాలెట్ డిస్ ప్లే అని అంటారు. తదనుగుణంగా ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగే ప్రాంతంలో ఉండే రిటర్నింగ్ అధికారి రిమోట్ ఓటర్ల నుంచి సమాచారం తెలుసుకుంటారు. రిమోట్ ఓటర్లకు చెందిన సమాచారాన్ని RVMలలో అక్కడి కక్కడే పొందు పరుస్తారు.
RVM విధానాన్ని వివరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. మొత్తం 65 రాజకీయ పార్టీలను ఆహ్వానం పలికింది. గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర స్థాయి పార్టీలకు ఈసీ ఆహ్వానం పలికింది. రిమోట్ ఓటింగ్ మెషీన్ గురించి సాంకేతిక నిపుణులు పార్టీ ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేసింది. ఈసీ అధికారులు వివరించేందుకు సిద్ధం అవుతున్న సమయంలో విపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఎటువంటి వివరణ ఇవ్వకుండా అధికారులు సమావేశాన్ని ముగించారు. రాజకీయ పార్టీలు ఈ విధానంపై తమ అభిప్రాయాలను ఫిబ్రవరి చివరి వారంలోగా తెలియజేయాలని గడువు ఇచ్చింది.