Mamata Decision: కాంగ్రెస్‌కు మమతా షాక్… ఒంటరిగానే పోటీ
Mamata on Lok Sabha Elections 2024: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలతో పాటు, దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం రోజున వెలువడ్డాయి. ఈ పలితాల అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో తృణమూల్ అభ్యర్థి ఓటమిపాలవ్వడంపై టీఎంసీ అధినేత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలు అనైతికంగా పొత్తు పెట్టుకున్నాయని, ఈ కారణంగానే బీజేపీ ఓట్లన్ని కాంగ్రెస్ అభ్యర్ధికి పడ్డాయని ఆమె ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అనైతికంగా పొత్తు పెట్టుకుంటూనే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పొటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయింది. తాము ఎలాంటి అనైతిక పొత్తులకు పాల్పడలేదని, కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లన్నీ కూడా సొంతంగా వచ్చినవేనని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. విపక్షాలన్నీ ఏకం కావాలని అనేక పార్టీలు పిలుపునిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్‌తో పాటు విపక్షాల ఐక్యమత్యం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీలన్నీ షాక్ అయ్యాయి. మమతా బెనర్జీ నిర్ణయం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని ఆరోపణలు చేస్తున్నాయి.