Varun Gandhi: బీజేపీకి బై.. కాంగ్రెస్ గూటికి వరుణ్ గాంధీ?
Varun Gandhi to quit BJP?: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గతంలో సొంత పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శించిన తీరు వలన ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో మోడీ ప్రభుత్వ లోపాలను వరుణ్ గాంధీ బహిరంగంగా విమర్శిస్తూ ఉండడం కొంతకాలంగా అందరికీ కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఇటీవల చేసిన ప్రకటనలు మరోసారి కొత్త ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. నిజానికి, వరుణ్ గాంధీ గతంలో తన సొంత పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శించిన తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు,
అంతేకాదు ఆయన కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఆయన రాస్తున్న వ్యాసాలు 2 సంవత్సరాలకు పైగా ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అలాగే గత నెలలో ఓ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం కూడా ఆశ్చర్యపరిచింది. ఈ బహిరంగ సభలో వరుణ్ గాంధీ మాట్లాడుతూ.. నేను నెహ్రూకు వ్యతిరేకిని కాదు, కాంగ్రెస్‌కు వ్యతిరేకిని కాదు, మన రాజకీయాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి తప్ప అంతర్యుద్ధాన్ని సృష్టించేలా కాదని ఆయన అన్నారు. నేడు కేవలం మతం, కులం పేరుతో ఓట్లు అడుగుతున్న వారికి ఉపాధి, విద్య, వైద్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించాలని ఆయన అన్నారు. ప్రజలను అణచివేసే రాజకీయాలు చేయకూడదని, ప్రజలను ఉద్ధరించే రాజకీయాలు చేయాలని వరుణ్ గాంధీ బహిరంగ సభలో పేర్కొన్నారు.
అంటే ఒకరకంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, అధికార బీజేపీ, పార్టీ అగ్రనాయకత్వం విధానాలపై వరుణ్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి, 2019లో నరేంద్ర మోదీ కేబినెట్‌లో తన తల్లి మేనకా గాంధీని చేర్చుకోని కారణంగా వరుణ్ అసమ్మతికి చెందిన సంకేతాలు మొదటి సారిగా వెలువడ్డాయి. అప్పటి నుంచి బీజేపీని టార్గెట్ చేయగలిగే ఏ ఒక్క అవకాశాన్ని వరుణ్ గాంధీ వదులుకోలేదు. భారతదేశపు తొలి రాజకీయ కుటుంబంగా గుర్తింపు పొందిన గాంధీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, మేనకా బీజేపీలో చేరారు. 1980లో విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన సంజయ్ గాంధీని మేనక వివాహం చేసుకున్నారు. వరుణ్ గాంధీ ఇటీవల చేసిన ప్రసంగం రాజకీయ విశ్లేషకులకు వరుణ్ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు అని అంటున్నారు.
గాంధీ ట్యాగ్‌తో దూకుడు ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రాంతీయ పార్టీలు చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇందులో శరద్ పవార్ యొక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ (TMC) అలాగే అఖిలేష్ యాదవ్ యొక్క సమాజ్ వాదీ పార్టీ (SP) ఉన్నాయి. అయితే ఆయన మాత్రం కాంగ్రెస్ కే మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. వరుణ్‌గాంధీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే పార్టీలో ఆయన స్థానం ఏంటన్నది రాహుల్ గాంధీ, సోనియా గాంధీపైనే ఆధారపడి ఉంటుంది. వరుణ్ గాంధీ కజిన్ ప్రియాంక గాంధీ తన సోదరుడి పట్ల చాలా ఉదారంగా పరిగణించబడుతున్నప్పటికీ వరుణ్ చేరికపై రాహుల్, సోనియా గాంధీల మధ్య ఫైనల్ ఓకే స్టాంప్ వేయడం ముఖ్యం. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది.